ఏపీలో ఇకపై 6‘ఆర్’లు పక్కాగా అమలు.. సీఎం జగన్ వినూత్న యత్నం.. దేశంలోనే తొలిసారి..
లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం.. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ అదే ప్రజలను బలిపెడుతోందనే ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన సందర్భంలోనూ ప్రజల భద్రత అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాలుష్య నియంత్రణకు, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకు, ప్రమాదాల నివారణకు కావాల్సినన్ని చట్టాలు ఇప్పటికే ఉన్నా.. వాటిని పక్కాగా అమలుచేసిన సందర్భాలు చాలా తక్కువ.

ఏపీఈఎంసీ ప్లాట్‌ఫామ్ లాంచ్
కన్యాకుమారి నుంచి కాన్పూర్ దాకా దేశమంతటా లక్షల కొద్దీ ఫ్యాక్టరీలు తమ వ్యర్థాలను సరిగా ప్రాసెస్ చేయకుండానే బయటికి వదులుతుండే దృశ్యాలు మనకు కొత్తకాదు. ఈ విధానానికి చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నాన్ని ఆరంభించింది. ఇందుకోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌ను ముఖ్యమంత్రి వైస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీపై క్యాంప్ ఆఫీసులో రివ్యూ నిర్వహించిన ఆయన.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా ఈ ఇనిషియేటివ్ చేపట్టారు. ఈ విధానంలో..

బాధ్యత ప్రభుత్వానిదే..
వ్యర్థాల ట్రీట్మెంట్ వ్యవస్థ లేని పారిశ్రమలు ఇకపై ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ ఫ్యాక్టరీల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే చాలు.. వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా శుద్ధిచేయంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇందుకోసమే జనవరిలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పరిశ్రమలకు, వ్యర్థాలను నిర్వహించే సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా ఈఎంసీ వ్యవహరిస్తుంది. ఆన్ లైన్ లో వ్యర్థాల బదలాయింపునకు వీలుకల్పిస్తూ ఏపీఈఎంసీ ప్లాట్‌ఫామ్‌ను సీఎం జగన్ లాంచ్ చేశారు.

దేశంలోనే తొలిసారి..
పరిశ్రమల నుంచి వ్యర్థాలు సేకరించి, వాటిని శుద్ధి చేసే బాధ్యతను ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. వ్యర్థాల నిర్వహణతోపాటు కాలుష్య నియంత్రణకు సంబంధించి ఆయా ఫ్యాక్టరీలపై రాబోయే రోజుల్లో గట్టి నిఘా ఉండనుంది. ఆయా పని ప్రదేశాల్లో వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్ ప్రక్రియలను, అలాగే ఈ-వేస్టేజీని సైతం ఏపీఈఎంసీ క్రమం తప్పకుండా నిర్వహించనుంది.

ఇకపై పక్కాగా 6‘ఆర్’లు
పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించడంలో ‘ఆర్' అక్షరంతో మొదలయ్యే ఆరు పదాలను.. రెడ్యూస్, రీ-యూజ్, రీసైకిల్, రీఫర్బిష్, రీడిజైన్, రీమాన్యుఫాక్టర్‌లను కీలకంగా భావిస్తారు. ఈఎంసీ ప్లాట్ ఫామ్ ద్వారా ఏపీలో ఇకపై ఈ 6‘ఆర్'లను పక్కాగా అమలు చేస్తామని, విషపూరితమైన వ్యర్థాలను నూటికి నూరుశాతం సురక్షితంగా డిస్పోజ్ చేస్తామని, తద్వారా ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వ్యర్థాలను శుద్ధి చేసినందుకుగానూ ట్రీట్మెంట్ ప్లాంట్లకు, ఏపీఈఎంసీకి ఆయా పరిశ్రమలు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications