కొత్త సీఎస్ ఎవరు?: సీనియర్లు వీరే: కేబినెట్ భేటీలో చర్చ: నీలం సాహ్నీకి వైఎస్ జగన్ సన్మానం
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ.. ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఈ ఉదయం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు ఆమెను సన్మానించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు.

రెండు సార్లు పొడిగింపు..
నిజానికి- నీలం సాహ్నీ ఈ ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించింది. ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలంటూ వైఎస్ జగన్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీనికి సిబ్బంది, వ్యక్తిగత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) సానుకూలంగా స్పందించింది. జులై నుంచి సెప్టెంబర్ వరకు తొలిసారిగా నీలం సాహ్నీ సర్వీసును పొడిగించింది. దాని ప్రకారం ఆమె సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. వైఎస్ జగన్ జోక్యం చేసుకోవడంతో మళ్లీ డిసెంబర్ 31 వరకు కొనసాగించింది. ఇక ఈ నెల 31న ఆమె రిటైర్ కానున్నారు.

ఎల్వీ ప్రసాద్ బదిలీ తరువాత..
1984 బ్యాచ్, ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్నీ ఉమ్మడి రాష్ట్రంలో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం డీఓపీటీ ఆమెను ఏపీకి కేటాయించింది. కొంతకాలం పాటు ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసిన తరువాత.. నీలం సాహ్నీ సీఎస్‌గా బాధ్యతలను స్వీకరించారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో..
అలాగే- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఆమె స్పష్టం చేయగలిగారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమని తేల్చి చెప్పారు. పలు సందర్భాల్లో నీలం సాహ్నీ.. ముక్కుసూటిగా వ్యవహరించారు.

కొత్త సీఎస్ ఎవరు?
ఇదిలావుండగా- కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నీలం సాహ్నీ తరువాత అత్యంత సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేస్తున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి ఆయన. ఆదిత్యనాథ్ దాస్ కంటే సీనియారిటీ ఉన్న అధికారులు ఉన్నారు. డాక్టర్ సమీర్ శర్మ, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర.. ఈ ముగ్గురూ ఆదిత్యనాథ్ కంటే సీనియారిటీ ఉన్న వారే. డాక్టర్ సమీర్ శర్మ 1985, మిగిలిన ఇద్దరూ 1986 బ్యాచ్ అధికారులు.
కొత్త సీఎస్ ఎవరు?: సీనియర్లు వీరే: కేబినెట్ భేటీలో చర్చ: నీలం సాహ్నీకి వైఎస్ జగన్ సన్మానం#YSJagan #Apgovt #Nilamsawhney pic.twitter.com/OfJiH1oAPK
— oneindiatelugu (@oneindiatelugu) December 18, 2020
ఆదిత్యనాథ్ కంటే సీనియర్లు ఉన్నా..
ఈ ముగ్గురిలో ఎక్కువకాలం పదవీలో ఉండేది డాక్టర్ సమీర్ శర్మ. వచ్చే ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారు. అభయ్ త్రిపాఠి జులై, సతీష్ చంద్ర నవంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ కాలాన్ని, సీనియారిటీని వైఎస్ జగన్ పరిగణనలోకి తీసుకుంటే.. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యే అవకాశం డాక్టర్ సమీర్ శర్మకే ఉంది. ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు మరో అధికారి జేఎస్వీ ప్రసాద్ కూడా 1987 బ్యాచ్ అధికారే. అదెలా ఉన్నప్పటికీ.. ఆదిత్యనాథ్ దాస్ పేరు కొద్దిరోజులుగా విస్తృతంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications