పవన్ కల్యాణ్ పై దృష్టిసారించిన వైఎస్ జగన్!!
రానున్న ఎన్నికలు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. రెండోసారి విజయం సాధించలేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనపరిస్తేనే విజయం వరిస్తుందని, పనితీరు మెరుగుపడనివారిని మార్చేస్తానని వారికి హెచ్చరికలు జారీచేస్తున్నారు.

జనసేనపై వైసీపీ దృష్టి
తాజాగా ఆయన జనసేన పార్టీపై, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై దృష్టిసారించారు. విశాఖపట్నం సంఘటన జరగకముందు వరకు అవసరమైతే ఒంటరిగా అయినా పవన్ పోటీకి సిద్ధపడి ఉన్నారు. అయితే పోలీసులు పవన్ ను విశాఖపట్నం నుంచి పంపించి వేయడం.. ఆయన మంగళగిరిలోని కార్యాలయానికి రావడం.. చంద్రబాబు స్వయంగా వచ్చి కలవడంలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. ఇరునేతలు మీడియాతో మాట్లాడారు. దీంతో పొత్తు ఖాయమేనని, ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినా ఎన్నికల సమయంలో ప్రకటించడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభావం ఉంటే ఎలా ఎదుర్కోవాలి?
ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీచేస్తే తమకు లాభమా? లేదంటే కలిసి పోటీచేస్తే నష్టమా? ఒకవేళ నష్టం ఉంటే ఆయా నియోజకవర్గాల్లో దానికి విరుగుడుగా ఏ చర్యలు తీసుకోవాలి? తదితరాలపై జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేళ్లమీద లెక్కింపదగిన సంఖ్యలో ప్రభావం ఉంటుందని తేలింది. అంతే కాకుండా వైసీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు ఇరు పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారా? అనే విషయం కూడా చర్చకు వచ్చింది.

వివరాలివ్వాలంటూ 'ఐప్యాక్' ను కోరిన అధిష్టానం
తనకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ ను ఈ విషయంపై పూర్తి వివరాలు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు టీడీపీ-జనసేన ప్రభావం ఎంత ఉంటుంది? ఏ నియోజకవర్గంలో ప్రభావం చూపించగలుగుతారు? ఒకవేళ వైసీపీపై ప్రభావం చూపించగలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల తీరుతెన్నులపై సర్వే నిర్వహించి ఒక నివేదికను తయారుచేయబోతున్నారు. వీరు ఎటువంటి సమాచారం ఇస్తారు? అనే ఉత్కంఠ వైసీపీలో నెలకొంది. ఐప్యాక్ సర్వే తర్వాత అన్ని విషయాలను వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications