ఏపీ గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ: ఢిల్లీ పర్యటన సహా కీలక అంశాలపై చర్చ, వెంట సతీమణి భారతి
అమరావతి: ఇటీవలే ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. గురువారం సాయంత్రం సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్ వచ్చిన సీఎం జగన్.. తొలుత గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్‌తో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

గవర్నర్ దంపతులను సత్కరించిన సీఎం దంపతులు
మొదట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతీ రాణా టాటా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌తో సీఎం భేటీలో కీలక అంశాలపై చర్చ
ప్రస్తుత సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం జగన్ గవర్నర్‌కు వివరించారు. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

గవర్నర్ ఢిల్లీ టూర్ సహా పలు విషయాలపై సీఎంకు వివరణ
కాగా, ఇటీవల ఢిల్లీలో పర్యటించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పరిపాలనపై ప్రధాని, హోంమంత్రికి గవర్నర్ నివేదిక అందించారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని, హోంమంత్రి వెల్లడించిన అభిప్రాయాలను సీఎంకు గవర్నర్ వివరించినట్లు తెలిసింది.

29న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
మరోవైపు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 29న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేయనున్నారు.












Click it and Unblock the Notifications