YS Jagan-PM Modi : ప్రధాని మోడీ ముందు 14 సమస్యలు పెట్టిన వైఎస్ జగన్ ..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ(pm modi)తో భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలోనే ఆయనతో చర్చలు జరిపారు. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ మేరకు 14 అంశాలతో ఓ వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలోని పలు పెండింగ్ సమస్యలు, విభజన హామీలు ఉన్నాయి.
రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోందని, ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు పెండింగులోనే ఉన్నాయని ప్రధాని మోడీకి జగన్ గుర్తుచేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని, వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరారు. గతంలో తాను ప్రస్తావించిన పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారనిత, ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి పురోగతి సాధించిందని గుర్తుచేశారు. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు.

అలాగే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను వెంటనే విడుదల చేసేలా సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని జగన్ కోరారు. గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని ఆక్షేపించరు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని ప్రధానికి తెలిపారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు.
పోలవరం ప్రాజెక్టు విషయలో కేంద్రం తగిన సహకారం అందిస్తే ఇది పూర్తవుతుందని జగన్ ప్రధానికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని, రెండేళ్లుగా ఈ నిధులు ఇవ్వలేదన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని గుర్తుచేశారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు రూ.7,058 కోట్లు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోందన్నారు. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ఈ విషయంలో ఏపీ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుందన్నారు. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందన్నారు.

రాష్ట్రంలో జిల్లాల విభజనతో 26 జిల్లాలయ్యాయని, వీటికి కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరారు. ఈ అలాగే వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని, ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని ప్రధానిని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications