శ్రీకాకుళం వలస కార్మికులపై స్పందించిన జగన్-ఆదుకోవాలని జై శంకర్ కు లేఖ
బహ్రెయిన్ లో శ్రీకాకుళం వలస కార్మికులపై వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. బహ్రెయిన్ కు పొట్టకూటి కోసం వెళ్లి అక్కడ ప్రైవేటు సంస్ధల సిబ్బంది చేతుల్లో వేధింపులు ఎదుర్కొంటున్న కార్మికుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాంగమంత్రి జై శంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అదే సమయంలో సీఎం జగన్ కూడా ఇదే అంశంపై జై శంకర్ కు లేఖ రాశారు.
బహ్రెయిన్ కు వెళ్లిన వలస కార్మికులు అక్కడ తమ యాజమాన్యాల చేతుల్లో వేధింపులకు గురవుతున్నారని, ఇందులోనూ ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని సీఎం జగన్ జై శంకర్ కు దృష్టికి తెచ్చారు. వీరిని తక్షణం తమ స్వస్ధలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. ఈ విషయంలో ప్రధాని కార్యాలయ అధికారులు.. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారుల్ని కానీ, అమరావతిలో సీఎం కార్యాలయాన్ని కానీ సంప్రదించవచ్చని జై శంకర్ కు రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వందలాది కార్మికులు కొన్నేళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లారు. వారు అక్కడ నిర్మాణ సంస్ధల తరఫున పని చేస్తున్నారు. తాజాగా వీరితో వివాదం తలెత్తడంతో కార్మికులపై సిబ్బంది దాడులకు దిగారు. దీంతో వీరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఏపీలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇచ్చిన వీడియోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఉదయం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ కూడా జై శంకర్ కు రాయడంతో కేంద్రం దీనిపై దృష్టిసారిస్తోంది.
వాస్తవానికి కరోనా తర్వాత గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల కష్టాలు రెట్టింపయ్యాయి. చాలా సంస్ధలు వీరిని పనుల్లోంచి తొలగించాయి. కరోనా కారణంగా వీరిలో చాలా మంది స్వదేశాలకు తిరిగి వచ్చేశారు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కూడా ఆయా సంస్ధలు నిరాకరిస్తున్నాయి. అయినా మన ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్ధితి. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే వీరి నియామకాలు, తొలగింపులు జరుగుతున్న నేపథ్యంలో వీరిని ఆదుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications