మీడియా తప్పుడు కథనాలపై వైఎస్ జగన్ ఫైర్-పనిలేక కూర్చున్నామా ?
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ కొరత ఉండేది. అప్పట్లో రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో పలు మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గడంతో సహజంగానే ఆక్సిజన్ లభ్యత పెరిగింది. దీంతో ఆక్సిజన్ కొరత ఫిర్యాదులు లేవు. కానీ తాజాగా ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ముగ్గురు చనిపోయారంటూ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు.
ఆక్సిజన్ ఇవాళ రాష్ట్రంలో పూర్తిస్ధాయిలో అందుబాటులో ఉందని, అలాంటి సమయంలో అదే పనిగా మనసులో కుళ్లు కుతంత్రాలు పెట్టుకుని ఆక్సిజన్ కొరతతో మనుషులు చనిపోయారని వార్తలు రాస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో 70 శాతం ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్లు ఖాళీగా ఉన్నట్లు నివేదికలు ఉన్నా.. ఆక్సిజన్ కొరత వల్ల రోగులు చనిపోయారని నిస్సిగ్గుగా వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఏ స్ధాయికి తీసుకొస్తున్నారో అర్ధఁ కావడం లేదన్నారు.

ఇంతమంది అధికారులు టైంపాస్ కాక ఇక్కడ కూర్చున్నారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. అందరూ ధ్యాస పెట్టి పనిచేయడం వల్లే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్నారు. ఇది కేవలం తనకు మాత్రమే వస్తున్న పేరు కాదన్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, కలెక్టర్ల ప్రయత్నం వల్లే వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. మంచి పేరు రాకూడదన్న దుగ్ధతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వార్తాపత్రికల ఫ్రంట్ పేజీలో ఇలాంటి వార్తలు రాసి జనానికి ఏం సందేశం పంపుతున్నారని జగన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications