సీఎం జగన్ రాయలసీమ జిల్లాల పర్యటన: వైఎస్‌కు నివాళి, 400 కోట్ల అభివృద్ధి పనులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు రాయలసీమలో జగన్ పర్యటించనున్నారు. జులై 8న వైయస్సార్ జయంతి సందర్భంగా వైయస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

జులై 8న పుట్టపర్తికి జగన్..
జులై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరతారు. 10 గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. వైయస్సార్ ఆర్బీకే ప్రారంభించడంతోపాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో సమావేశమవుతారు.
ఆ తర్వాత రాయదుర్గంలో వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ ల్యాబ్ ప్రారంభోత్సవం, లబ్ధిదారులతో ముఖాముకి నిర్వహిస్తారు. అక్కడే పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రైతులతో మాట్లాడతారు.

జులై 8న సాయంత్రానికి పులివెందులకు.. వైఎస్‌కు నివాళి
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందుల చేరుకుంటారు. సాయంత్రం 4 గం టలకు ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి సీఎం జగన్ నివాళులర్పిస్తారు. రాత్రికి అక్కడే విడిది చేస్తారు. రెండో రోజైన జులై 9న ఉదయం 11 గంటల ప్రాంతంలో కడప జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. కాగా, జగన్ సీఎం అయిన తర్వాత బద్వేలుకు వెళ్లడం ఇదే తొలిసారి.

బద్వేలుకు ముఖ్యమంత్రిగా తొలిసారి..
బద్వేలు మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడ్నుంచి కడప నియోజకవర్గంలో పర్యటిస్తారు. కడపలోని సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి స్టేడియానికి చేరుకుని విగ్రహాలు, ఫ్లడ్ లైట్లను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రెండురోజుల పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications