వద్దనేందుకు మేం ఇస్తామంటే కదా: టీకి ఏపీ కౌంటర్
హైదరాబాద్: కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య మాటల యుద్ధం జరిగింది. తమకు కృష్ణపట్నం విద్యుత్ వద్దని, దాని యూనిట్ ధర ఎక్కువ ఉందన్న తెలంగాణకు ఏపీ కౌంటర్ ఇచ్చింది. అసలు తాము ఇస్తామంటే కదా.. వారు వద్దనేందుకు అని ఎద్దేవా చేసింది. విద్యుత్ ఇచ్చేందుకు తాము ఆఫర్ చేయలేదని చెప్పారని సమాచారం.
కాగా, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ఆరంభమైంది. విశాఖలో హిందూజా థర్మల్ ప్లాంట్ నుంచి 1040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ విద్యుత్‌లో తమకు వాటా ఉందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తోంది.

భౌగోళికంగా ఎక్కడ విద్యుత్ ప్లాంట్ ఉంటే ఆ విద్యుత్ తమదేనని, ఏపి మొదటి నుంచి చెబుతోంది. పైగా కృష్ణపట్నం విద్యుత్‌పై విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఈ విద్యుత్‌లో తమకు 53 శాతం వాటా ఉందని, 1600 మెగావాట్లలో 900 మెగావాట్లు తమకు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లింది.
తమకు విద్యుత్ ఇవ్వడం లేదని ఈ ఏడాది జనవరి 27వ తేదీన తెలంగాణ విద్యుత్ సంస్ధలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ అంశంపై కేంద్ర విద్యుత్ అథారిటీ రెండుసార్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ అధికారులను పిలిపించి సమావేశం నిర్వహించినా, ఫలితం రాలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రా విద్యుత్‌లో తమకు వాటా అక్కర్లేదని చెప్పారు. తాజాగా తెలంగాణ జెన్కో విద్యుత్ వద్దని లేఖ రాసింది.












Click it and Unblock the Notifications