అమరావతిలో భూముల వ్యవహారంలో కీలక మలుపు..!!
అమరావతిలో భూముల అమ్మకాల దిశగా సీఆర్డీఏ నిర్ణయించినట్లు తెలుస్తోంది
అమరావతిలో భూముల అమ్మకాల దిశగా సీఆర్డీఏ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వేలం ద్వారా వీటిని విక్రయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకోసం 14 ఎకరాల అమ్మకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాజధాని ప్రాంతం మీదుగా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కాజ -గుండుగొలను బైపాస్ రహదారి పక్కనే ఉన్న నవులూరు వద్ద పది ఎకరాలు విక్రయించినున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎకరం రూ 5.94 కోట్లుగా ఖరారు చేసారు. అదే విధంగా పిచ్చుకలపాలెం వద్ద నాలుగు ఎకరాలు విక్రయానికి నిర్ణయించినట్లు సమాచారం.
నవులూరు, పిచ్చుకలపాలెంలలోని మొత్తం తొమ్మిది సర్వే నెంబర్లలోని 14 ఎకరాలను ఆక్షన్ వేయాలని నిర్ణయించారు. నవులూరులో సర్వే నెంబర్లు 570, 576, 578, 579, 580, 585, 586లలోని 10 ఎకరాలు, పిచ్చుకపాలెంలో సర్వే నెంబర్ 24, 37లలోని 4 ఎకరాలను ఆక్షన్ వేయనున్నారు. అమరావతి అభివృద్ధి పనుల కోసమే తాము భూములను ఆక్షన్‌కు పెడుతున్నట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. భూముల ఆక్షన్ ను వచ్చే స్పందనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆక్షన్‌కు ఉంచనున్న 14 ఎకరాలలో నవులూరులో ఎకరం రూ.5.91 కోట్లు, పిచ్చుకపాలెంలో ఎకరం రూ.5.41 కోట్లు ధర నిర్ణయించారు. గతంలోనూ సీఆర్డీఏ అధికారులు ఇక్కడి భూముల అమ్మకానికి సంబంధించి ధర ఫిక్స్ చేసారు. కానీ, అప్పట్లో వేలం నిలిచిపోయింది.

సీఆర్డీఏ భూముల విక్రయానికి ప్రయత్నిస్తోందని స్థానిక రైతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇప్పుడు భూములు అమ్మేందుకు నిర్ణయాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ప్రభుత్వం ఈ కేసును త్వరగా విచారించాలని అభ్యర్ధించింది. ఈ నెల 23న సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రానుంది. అటు ప్రభుత్వం అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభా వేదికగా విశాఖ నుంచి పాలన పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో అమరావతి భూముల విషయంలో సీఆర్డీఏ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications