జగన్ మళ్లీ సీఎం కాకపోతే...డిప్యూటీ సీఎం నోట ఆ మాట- రాజకీయాల నుంచి తప్పుకుంటా
ఏపీలో కేబినెట్ విస్తరణ, కొత్త జిల్లాలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయంపై ప్రభావం చూపే పలు అంశాలపై రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో తమకు 160 సీట్లు ఖాయమని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ ప్రకటన ఆ పార్టీ నేతలతో పాటు వైసీపీలో సైతం చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడు ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేసి ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది.
ఏపీలో టీడీపీ 160 సీట్లు గెల్చుకుంటుందన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటనపై ఇవాళ ఆయన సొంత జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో ఆంధ్రా ఫిష్ మార్ట్ ప్రారంభించిన కృష్ణదాస్.. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తిరిగి ఎన్నిక కాకపోతే తమ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందని ధర్మాన కృష్ణదాస్ సంచలన ప్రకటన చేశారు.

అచ్చెన్నాయుడు ప్రకటనను ప్రస్తావిస్తూ తాము గాజులు తొడుక్కుని కూర్చున్నామా అని ధర్మాన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు మాటలకు భయపడాల్సిన పని లేదని, జగన్ మళ్లీ సీఎం అవుతారని కార్యకర్తలకు కృష్ణదాస్ భరోసా ఇచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కృష్ణదాస్ వ్యాఖ్యలు వైసీపీలో చర్చనీయాంశమవుతున్నాయి. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీలో చర్చ జరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications