జగన్ ను ముంచేది వాళ్లే- టికెట్ కోసం కాళ్లు పట్టుకున్నా- డిప్యూటీ సీఎం షాకింగ్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సొంత పార్టీల్లో నేతల నుంచి అధినేతలపైనా నేతల మాటల వేడి పెరుగుతోంది. ఎన్నికల సమయంలో బయటపడే అసంతృప్తుల సంగతి ఎలా ఉన్నా ఎప్పటినుంచో విధేయతగా ఉంటూ వస్తున్న నేతలు కూడా ఈ మధ్య రెచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్లు పట్టుకోవాల్సి వస్తోందంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. తాను టికెట్ కోసం మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నానంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి కదా అన్నారు. ఎస్సీలమైన తాము ఇంకేం చేయాలన్నారు. తాను కూడా టికెట్ కోసం సీఎం జగన్ కాళ్లు పట్టుకున్నానంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెల్లడించారు.

రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పు, టీడీపీ నుంచి వచ్చి చేరుతున్న నేతలకు టికెట్లను కేటాయించడంపైనా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. జగన్ ను ముంచేది వారేనన్నారు. టీడీపీ నుంచి వచ్చే పనికిరాని వారికి టికెట్లు ఇస్తున్నారని, వారి క్యారెక్టర్లు చూసి టికెట్లు ఇవ్వాలని జగన్ కు సూచించారు. అలా కాకుండా టికెట్లు ఇస్తే గతంలో 23 మంది పార్టీ వదిలి టీడీపీకి వెళ్లిపోయారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవర్టులుగా వచ్చి టికెట్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications