రాం గోపాల్ వర్మ కేసుపై పవన్ కళ్యాణ్ సంచలన స్పందన!
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు నమోదు కావడంతో పాటు రాంగోపాల్ వర్మ అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన కోసం హైదరాబాద్లో గాలింపు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాంగోపాల్ వర్మ పైన ఏపీలో నమోదైన కేసుల పైన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీవీ కేసుపై మాట్లాడిన పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఆర్జీవి కేసుల విషయం పైన, పోలీసులకు దొరక్కుండా ఆర్జీవి తప్పించుకుని తిరుగుతున్న తీరుపైన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్, రాష్ట్ర హోంశాఖ తన దగ్గర లేవని ఇంతకంటే ఈ విషయంలో తానేమీ చెప్పలేను అన్నారు.

చంద్రబాబుతో దీనిపై చర్చిస్తా
తాను ఏమి మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్న ఆయన తమను ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడంలో తటపటాయింపు దేనికనే విషయాన్ని మీడియా అడుగుతుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు విషయంలో ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు వెనకా ముందు ఆడుతున్నారో తెలియడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ తప్పిదాలతో ఇప్పుడు తిప్పలు
ప్రస్తుతం పోలీసుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఇప్పుడు తాము ఇబ్బందులను అనుభవిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం లేవని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
అదానీ వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం
గత ప్రభుత్వ హయాంలో కేవలం సమోసాల కోసం 9 కోట్లు ఖర్చు చేశారని అసహనం వ్యక్తం చేశారు. గత వైసిపి ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన జలజీవన్ మిషన్ నిధులు వాడలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధుల కోసం తాను ప్రధాని మోదీని కలుస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌతమ్ అదాని లంచం, మోసం ఆరోపణల పైన సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications