ఏపీ విద్యామంత్రి సురేష్‌కు కరోనా- వాట్సాప్ స్టేటస్‌లో వెల్లడి.. మొన్న కేబినెట్‌కు హాజరు..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలకు కూడా కరోనా సోకింది. ఇదే కోవలో విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తాజాగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. దీంతో ఈ వార్త ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది.
రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ వచ్చే నెల నుంచి విద్యాసంస్ధలు తెరిచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా స్కూళ్లలో వసతులు, నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షలు, పర్యటనలతో సురేష్ బిజీగా ఉన్నారు.

కరోనాను కూడా లెక్కచేయకుండా ఆయన సమీక్షల్లో బిజీగా గడుపుతున్నారు. ఇదే క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు అనుమానం కలిగింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన తాజాగా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నెల 19న జరిగిన కేబినెట్ భేటీకి ఆయనతో పాటు హాజరైన పలువురు మంత్రుల్లో ఆందోళన మొదలైంది. కరోనా లక్షణాలతోనే ఆయన కేబినెట్‌కు హాజరు కావడంతో ఇప్పుడు ఆయన నుంచి ఎవరికైనా వైరస్ సోకిందేమోనని అధికారులు ఆరా తీస్తున్నారు. సురేష్ తో సమీక్షలకు హాజరైన విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.