మెరుపు సమ్మె: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం దిశగా..!
హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తోంది. దక్షిణాది పవర్ గ్రిడ్ పూర్తిగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తక్షణమే పిఆర్సీని అమలు చేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని చాలా గ్రామాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ నిలిచిపోయింది. సోమవారం సమ్మె రెండో రోజుకు చేరుకుంది.
తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగులు భీష్మించారు. దీంతో విద్యుత్ ఉత్పాదన, సరఫరాల్లో తీవ్ర అంతరాయాలు తలెత్తాయి. పలు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఉద్యోగ సంఘాల నేతలతో ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలంకావడంతో సమ్మె కొనసాగించేందుకే ఉద్యోగులు నిర్ణయించారు.
అసలే వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడం బొగ్గు నిల్వలు తరిగిపోవడం వంటి వాటితో సంక్షోభంలో ఉన్న విద్యుత్ శాఖ.. ఉద్యోగుల మెరుపు సమ్మెతో పెను సంక్షోభంలో కూరుకుపోతుందన్న ఆందోళనవ్యక్తమవుతోంది. త్వరలో ఏర్పడనున్న ప్రజాప్రభుత్వాలే పిఆర్సీ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని గవర్నర్ నరసింహన్ పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. దీంతో తమ నిరసన కొనసాగించాలని విద్యుత్ సంఘాల ఐకాస నిర్ణయించింది. అయితే పిఆర్సీ అమలు చేయలేని పక్షంలో కనీసం మధ్యంతర భృతి(ఐఆర్)నైనా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతిపాదించింది.

దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ సురేశ్ చందా, జెన్‌కో ఎండీ విజయానంద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు అటు సీఎస్ మహంతితోను, గవర్నర్ నరసింహన్‌తోనూ చర్చలు జరిపారు. వేతనసవరణల్లో భాగంగా ఫిట్‌మెంట్ బెనిఫెట్‌ను 27.5 శాతం ఇవ్వాలని నిర్ణయించినందున దానిని ఐఆర్ రూపంలో ఇస్తామంటూ ఉద్యోగులకు చెప్పాలని అధికారులకు గవర్నర్ సూచించారు. మిగతా అంశాలపై త్వరలో ఏర్పడే ప్రజాప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయన్న విషయం ఉద్యోగులకు చెప్పాలని సూచించారు.
గవర్నర్ చెప్పిన విషయాన్నే అధికారులు ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతినిధులకు తెలియజేశారు. అయితే ఐఆర్‌ను కనీసం 30 శాతం ఇవ్వాలని ఐకాస ప్రతినిధులు పట్టుబట్టగా అధికారులు అంగీకరించలేదు. ఆదివారం రాత్రి పదిగంటలవరకు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం రాలేదు. అయితే సోమవారం మరోసారి చర్చలు జరపనున్నారు. ఎన్టీపీఎస్‌లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. కెటిపిఎస్‌లో 1720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 370 మెగావాట్లు మాత్రమే జరుగుతోంది.
మరోవైపు సమ్మె విరమించాలని ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణకు కాబోయే సిఎం కెసిఆర్‌లు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ సంఘం (పిఆర్సీ) ఒప్పందం అమలు 2014 ఏప్రిల్ నుంచే ఉంటుందని సీఎస్ పికె మహంతి చెప్పారు. నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్య జరిగినా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమ్మె విరమించాలని విజ్ఞప్తి కోరారు.












Click it and Unblock the Notifications