ఉద్యోగుల ఉద్యమం అంటే ఎంటో ప్రభుత్వానికి రుచిచూపిస్తాం: పీఆర్సీ సాధన సమితి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. చలో విజయవాడకు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు భారీగా విజయవాడకు తరలి వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వాటిని ఛేదించుకుని మరీ రాష్ట నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధాయులు తరలి వచ్చారు. విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించి తమ సత్తాను చాటారు.
Recommended Video

విజయవాడలో ఉద్యోగుల భారీ ప్రదర్శన
విజయవాడలోని ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థీయేటర్ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలి .. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

బుగ్గన పిట్ట కథలు ఆపు
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రానాథ్ పిట్ట కథలు మానాలని పీఆర్సీ సాధన ప్రతినిధి సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నాలుగు స్తంభాలాట ఆడిందని మండిపడ్డారు. ఛలో విజయవాడను సక్సెస్ చేసి ఉద్యోగులు తమ సత్తా ఎంటో ప్రభుత్వానికి చాటారన్నారు. తమ సమస్యలు వారంలో తేల్చేస్తామన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వారాల సమయం తీసుకున్నారని మండిపడ్డారు. తమ ఉద్యమం ఇంతటితో ఆగదని ప్రభుత్వం దిగివచ్చే వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం మరింత ఉధృతం
ప్రభుత్వం తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కొత్తగా తెచ్చిన పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కితీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమ సత్తా ఎంటో రాష్ట్ర ప్రభుత్వానికి రుచిచూపిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications