గోదావరి జలాలపై పేచీ: ఎపికి ఎదురుదెబ్బ, తెలంగాణ వాదన ఇదీ...
హైదరాబాద్: ఇటీవల కృష్ణా జలాల పంపిణీలో ఇరకాటంలో పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి రెండ్రోజుల క్రితం జరిగిన గోదావరి బోర్డు సమావేశంలోనూ ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవాలని ఎపి పేచీ పెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అనవసర అంశాలను తెరమీదకు తెచ్చి వివాదం చేస్తున్నారని తెలంగాణ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.
రెండు రోజుల కిందట జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఆ రాష్ట్ర అధికారులు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లుగా స్పష్టమవుతున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు సమావేశానికి హాజరైన అంశాన్ని తెరమీదకు తెచ్చి వివాదం చేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోందంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది.
ఇకముందు జరిగే బోర్డు సమావేశాలకు ఆయనను అధికారిక సభ్యుడిగా పంపేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకు నిబంధనలు కూడా అనుమతిస్తున్నందున ఆ మేరకు బోర్డుకు అధికారిక లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

గతంలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లోనూ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను ఆ బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రయత్నించింది. బచావత్ ట్రిబ్యునల్ వాటాల ప్రకారం కృష్ణాజలాల్ని వాడుకుందామని ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత కృష్ణా బేసిన్‌లో నీటివాడకం కాకుండా ప్రాజెక్టుల వారీగా నీటివాడకాన్ని ప్రామాణికంగా తీసుకుంది.
ఆ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సైతం అదే విధానాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల కిందట తెలంగాణ తరపున బోర్డు సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ఏపీ కుట్రను విజయవంతంగా ఛేదించారు. కృష్ణా ప్రాజెక్టులపై తమ ప్రయత్నం ఫలించకపోవడంతో తాజాగా రెండు రోజుల కిందట జరిగిన గోదావరి బోర్డు సమావేశంలోనూ ఏపీ అధికారులు అదే వాదన వినిపించారు.
పట్టిసీమ అనేది పోలవరంలో అంతర్భాగమని, అందుకే తాము కృష్ణాలో 45 టీఎంసీలు వదులుకునేందుకు సిద్ధమైనట్లుగా ఎపి రాష్ట్ర అధికారులు చెప్పారు. తెలంగాణ వాదిస్తున్నట్లుగా ఇది కొత్త ప్రాజెక్టు అయితే తాము 45 టీఎంసీలను ఎందుకు వదులుకోవాలనే ప్రశ్నను లేవనెత్తారు.
కానీ ట్రిబ్యునల్ ప్రకారం చూస్తే పోలవరమే కాదు ఏ నది నుంచైనా కృష్ణాకు నీటిని మళ్లిస్తే తద్వారా ఎగువ ప్రాంతంలోని రాష్ర్టాలకు ఆ మేరకు హక్కులు వస్తాయని ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కానంత మాత్రాన ట్రిబ్యునల్‌లోని ఈ నిబంధన వర్తించదా? తెలంగాణ వాదిస్తోంది.












Click it and Unblock the Notifications