దేవుడి రూపంలో వరాలిచ్చాడు: చంద్రబాబుకు రాజధానిలో గుడి, దసరానాడే
అమరావతి: తమ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నట్లు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండల టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ తెలిపారు.
హరిశ్చంద్రపురం గ్రామంలో కృష్ణానది ఒడ్డున రూ.15 లక్షల సొంత ఖర్చుతో దీన్ని నిర్మించనున్నట్లు వారు చెప్పారు. రాజధానికి శంకుస్థాపన చేసే విజయదశమి రోజునే గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వారు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటనతో ఇక్కడి రైతుల బతుకులు మారిపోయాయని, సాక్షాత్తు దేవుడే చంద్రబాబు రూపంలో వరాలను కురిపించారని ప్రశంసించారు.

కాగా, నారా చంద్రబాబు విగ్రహాలను ప్రతిష్ఠించుకునేందుకు ఏపీ రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలు, ముఖ్యంగా గుంటూరు జిల్లా గ్రామాలు పోటీ పడుతున్నట్లుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తుళ్లూరు, వినుకొండ, మంగళగిరి తదితర మండలాల నుంచి చంద్రబాబు విగ్రహాల కోసం ఆర్డర్లు వస్తున్నాయని కూడా వార్తలొచ్చాయి.
రాష్ట్రం అభివృద్ధి దిశగా చంద్రబాబు చేస్తున్న పనులు తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని, అందువల్లే ఆయన విగ్రహాలను నిత్యమూ తమ కళ్ల ముందు ఉంచుకోవాలని భావిస్తున్నామని ప్రజలు, రైతులు భావిస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications