వర్మకు 2 లక్షలకు బదులు 2 కోట్లిచ్చిన జగన్ సర్కార్ ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాంగోపాల్ వర్మ హవా నడిచేది. అప్పట్లో ఆయన కూడా వైసీపీకీ, జగన్ కు అనుకూలంగానూ, విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్, లోకేష్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయేవారు. ఇదే క్రమంలో ఆయన అప్పటి సీఎం వైఎస్ జగన్ పై వ్యూహం పేరుతో ఓ సినిమా తీశారు. జగన్ ఎన్నికల్లో గెలిచేందుకు పన్నిన వ్యూహాల్ని ఇందులో చిత్రీకరించారు. ఈ సినిమాకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వమే ప్రమోషన్ చేసి పెట్టింది.
ఇందులో భాగంగా ఏపీ పైబర్ నెట్ లో వ్యూహం చిత్రం ప్రసారం చేసినందుకు రాంగోపాల్ వర్మకు ఏకంగా 2.10 కోట్లు చెల్లించింది. వాస్తవానికి ఫైబర్ నెట్ లో ఈ సినిమా ప్రసారం చేసి 18 లక్షల వ్యూస్ వచ్చినందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా 2 కోట్లు చెల్లించినట్లు ఇవాళ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో ఫైబర్ నెట్ ను వైసీపీ ప్రభుత్వం ఏ స్ధాయిలో వాడుకుందో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్ గ్రిడ్ లో అర్హత లేని ఎంతో మంది ఉద్యోగుల్ని వాట్సాప్ ద్వారా నియామకాలు చేశారని, వాళ్లందరినీ తొలగిస్తున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్ లో అప్పట్లో 10 లక్షల కనెక్షన్లు ఉండగా.. వాటిలో 5 లక్షల కనెక్షన్లను వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసిందన్నారు. ప్రస్తుతం ఫైబర్ నెట్ కార్పోరేషన్ దివాలా తీసే స్ధితిలో ఉందని, త్వరలోనే ఖర్చులు తగ్గించుుకుని, నిధులు సమీకరించుకుని నిలదొక్కుకుంటామని జీవీ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఫైబర్ నెట్ ఛార్జీలు తగ్గించడంతో పాటు కొత్త కనెక్షన్లను సైతం తక్కువ ధరకే ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications