AP Pensions: రేపు ఏపీలో ఆ 71 వేల మందికి పెన్షన్ల పంపిణీ..!
ఏపీలో రేపటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ పెన్షన్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ సర్కార్ నిరాకరించిన పెన్షన్లను ఇచ్చేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించిన లబ్దిదారుల్ని గుర్తించడంతో పాటు వీరికి పెన్షన్లు ఇచ్చేందుకు నిధుల్ని సైతం విడుదల చేసింది. అలాగే సచివాలయాల్లోనూ ఈ కొత్త కేటగిరీ పెన్షన్ల వివరాలను అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, తీవ్ర అనారోగ్య పెన్షన్లతో పాటు స్పౌజ్ (భర్త చనిపోతే భార్యకు ఇచ్చే) పెన్షన్ కేటగిరీని సృష్టించారు. గతంలో ఈ కేటగిరీ కింద లబ్దిదారులకు పెన్షన్లు ఇచ్చేవారు కాదు. భర్త చనిపోతే ఆ పెన్షన్ ఇక భార్యకు లభించే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ ఆ నిబంధన మార్చి భర్త స్ధానంలో భార్యకు పెన్షన్ లబ్ది కొనసాగించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం స్పౌజ్ కేటగిరీని అందుబాటులోకి తెచ్చింది.

దీంతో ఈ కొత్త స్పౌజ్ కేటగిరీ కింద మొత్తం 71380 మంది లబ్దిదారుల్ని పెన్షన్ ఇచ్చేందుకు గుర్తించారు. అయితే ఈ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడంతో జూన్ 1న వీరికి పెన్షన్లు అందించలేకపోయారు. దీంతో వీరికి రేపు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వీరికి పెన్షన్లు ఇచ్చేందుకు మొత్తం రూ. 29.60 కోట్ల నిధుల్ని కూడా విడుదల చేసింది. దీంతో వీరికి రేపు 4 వేల రూపాయల చొప్పున పెన్షన్ ను సచివాలయ సిబ్బంది అందించనున్నారు.
ఇప్పటివరకూ భర్త పెన్షన్ అందుకుంటూ చనిపోతే ఆయన మరణ ధృవీకరణ పత్రం అందిస్తే ఈ స్పాజ్ కేటగిరీలో చేర్చి భార్యలకు తర్వాతి నెల నుంచి పెన్షన్ అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలో ఇలా ఇబ్బందులు పడుతున్న 71 వేల మందికి పైగా రేపటి నుంచి పెన్షన్ అందుకోబోతున్నారు. వీరు జీవించినంతకాలం ఇలా పెన్షన్ కొనసాగబోతోంది. దీంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications