AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్..! జీవో జారీ..
ఏపీలో ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి నేపథ్యంలో బకాయిల వసూళ్ల కోసం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి గతంలో ఇచ్చినంత కాకపోయినా అందులో 50 శాతం రాయితీ ప్రకటిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కబోతోంది.
ఏపీలో ఆస్తిపన్ను బకాయిలపై గత రెండేళ్లుగా ప్రతీ ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ ప్రకటిస్తున్నారు. దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకుండా అందులో 50 శాతం మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 50 శాతం వడ్డీ రాయితీ చేస్తున్నట్లు ఇవాళ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారు ఈ 50 శాతం వడ్డీ రాయితీతో పన్ను చెల్లించేందుకు వీలు కలుగుతోంది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ పాత బకాయిలతో సహా రూ.2341.78 కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ కేవలం రూ.1525.91 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వం చేసేది లేక ఇక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చింది. గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా 50 శాతం మాత్రమే వడ్డీ మాఫీ చేయడంతో ఆ మేరకు బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 31లోపు లేదా ఆ రోజు వరకూ పూర్తి బకాయి కట్టే వారికి ఈ 50 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఇప్పటికే ఆస్తిపన్ను వడ్డీతో సహా చెల్లించిన వారికి వచ్చే ఏడాది పన్నులో ఈ రాయితీని డిస్కౌంట్ చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications