ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఉచిత బస్సు వేళ ఇన్ ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉచిత బస్సు పథకం అమలుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అదే సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించే విషయంలో మంత్రులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభంతో పాటు జెండా ఆవిష్కరణ కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ప్రతీ ఏటా ఇన్ ఛార్జ్ మంత్రులు తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాల్లో ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ చేసేవారు. ఏ జిల్లాకు కేటాయించిన ఇన్ ఛార్జ్ మంత్రి ఆ జిల్లాలోనే ఇలా పతాకావిష్కరణలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఉచిత బస్సు అమలు పథకం ప్రారంభం కూడా ఆదే రోజు ఉండటంతో ప్రభుత్వం వీరి బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ప్రస్తుతం జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులుగా ఉన్న వారు ఈసారికి మాత్రం తమ సొంత జిల్లాల్లోనే ఆగస్టు 15న పతాకావిష్కరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత అదే జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకాన్ని జిల్లా స్ధాయిలో ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ఈసారి మంత్రులు పంద్రాగస్టును తమ సొంత జిల్లాలకే పరిమితం కాబోతున్నారు.

ఈసారి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ముహుర్తంగా నిర్ణయించడంతో ప్రభుత్వం ఈ మార్పు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం అమల్లో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ఇవాళ పూర్తి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక ఈ పథకంలో అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న పరిహారం కూడా ప్రకటిస్తే ఆయా వర్గాలు కూడా సంతోషంగా ఉండే అవకాశముంది.












Click it and Unblock the Notifications