ఏపీలో సంక్షేమ పథకాల అమలులో కీలక నిర్ణయం..!!
ఏపీలో సంక్షేమ పథకాల అమలు అంశంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పధకాల అమలు..పర్యవేక్షణ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అధికార పార్టీ నేతలు ప్రతీ ఇంటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమం గురించి వివరిస్తున్నారు.
రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది జరుగుతోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఈ పథకాలే తమకు తిరిగి అధికారం అందిస్తాయని భావిస్తున్న అధికారులు ఇప్పుడు తాజా నిర్ణయం తీసుకుంది.

పథకాల అమలుకు ప్రాధాన్యత: సీఎం జగన్ నాడు విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో నవరత్నాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోగా ప్రకటించి..వాటి అమలు కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 46 నెలల కాలంలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా రూ 2.05 లక్షల కోట్లు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసినట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం చేయని సంక్షేమం తన పాలనలో అందిస్తున్న విషయాన్ని ప్రధానంగా చెబుతున్నారు. ఇదే సమయంలో తమ ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తాను సింగిల్ గానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. మంచి జరిగిన లబ్దిదారులే తన సైనికులుగా ప్రకటించారు.
ప్రతీ ఇంటా మద్దతు సాధించేలా: దీంతో, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పథకాల అమలు పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించాలని భావించింది. ఇందుకోసం ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఎఎస్ ప్రాతిపదిక 26 మందిని స్పెషల్ ఆఫీసర్లు (ప్రత్యేకాధికారి)గా నియమించింది. అందులో భాగంగా ప్రధానంగా నాడు -నేడు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల పనితీరును మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకాధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఇప్పటికే వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేకంగా సిద్దం చేసిన పార్టీ టీం ప్రతీ ఇంటికి వెళ్లి జగనన్నకు చెబుదాం అంటూ కొత్త కార్యక్రమం అమలు చేస్తోంది. ఇదే సమయంలో అధికారికంగా సీనియర్ ఐఏఎస్ లకు జిల్లాల వారీగా బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయింది.
ఐఏఎస్ లకు బాధ్యతలు: ప్రతీ ఇంటికి తాము అందిస్తున్న పథకాలను మరింతగా వివరించటం ద్వారా.. వారితో మరింత కనెక్ట్ అవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందు కోసం గత పాలన..ప్రస్తుత పాలనలో అమలు చేస్తున్న కార్యక్రమాలలు...అందుతున్న లబ్దిని వివరిస్తూ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్తున్నారు.
ఇవి కొనసాగాలంటే జగన్ పాలన అవసరమనే సందేశం బలంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని నిర్వహించి.. లబ్ది దారుల నుంచి ప్రభుత్వానికి అందుతున్న మద్దతును అంచనా వేస్తున్నారు. పక్కా వ్యూహాత్మకంగా ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా సాగుతున్న ఈ మొత్తం కార్యక్రమంలో ఇక జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ ల నియామకంతో మరింత పక్కాగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications