ఏపీలో తేలిన అప్పుల లెక్క-షాకింగ్ గణాంకాలు-ఎవరెంతో తెలుసా ?
ఏపీలో ప్రభుత్వం చేసే అప్పుల గురించి రాజకీయంగా ఎప్పుడూ దుమారం రేగుతూనే ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, విపక్షాలు ఎప్పుడూ అప్పులపై తమను అనుకూలమైన నంబర్లను చెబుతూ జనాల్ని గందరగోళంలోకి నెడుతూనే ఉంటాయి. అయితే మధ్య మధ్యలో అధికార పార్టీలు అధికారిక లెక్కల్ని అనుకోకుండా బయటపెడుతూనే ఉంటాయి. దీంతో అప్పటివరకూ వారు చెప్పిన లెక్కలు తప్పని తేలిపోతుంటుంది. అలాంటిదే ఓ పరిణామం చోటు చేసుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జగన్ సర్కార్ 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ విపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము గతంలో టీడీపీ చేసిన అప్పు కంటే తక్కువే చేశామని పదే పదే చెప్పుకునేది. దీంతో జనంలోనూ గందరగోళం నెలకొనేది. ఆ తర్వాత వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ సర్కార్ వెళ్లిపోయే నాటికి ఎంత అప్పు ఉంది, తమ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పు వివరాన్ని బయటపెట్టింది.

మండలిలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా ఏపీలో అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వాస్తవాలు బయటపెట్టారు. ఇందులో ఆయన గతంలో టీడీపీ సర్కార్ గద్దె దిగే నాటికి అంటే 2018-19 నాటికి ప్రభుత్వానికి రూ.2,57,509 కోట్లు, కార్పొరేషన్లకు రూ.49 వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. అలాగే వైసీపీ సర్కార్ గద్దెదిగే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల అప్పులు రూ.9,74,556 కోట్లకు చేసినట్లు వెల్లడించారు.
అలాగే గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే 2024 జూన్ 12 నుంచి 2024 డిసెంబరు 31వరకు పెరిగిన నికర రుణం రూ.44,124కోట్లు మాత్రమేనని ఆర్థికమంత్రి తెలిపారు. వీటిలో 41,599కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల కోసమే చెల్లించామన్నారు. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ 2014-19, 2019-24 సంవత్సరాల అప్పులను వేర్వేరుగా చూపిస్తూ శ్వేతపత్రం ఇవ్వాలని కోరగా.. ఆర్థికమంత్రి పయ్యావుల ఏజీ నివేదిక ప్రకారం ప్రభుత్వానికి మొత్తం 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. దీంతో ఏపీ అప్పు 9.74 లక్షల కోట్లు మాత్రమేనని తేలిపోయింది.












Click it and Unblock the Notifications