ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలపై సర్కార్ మరో క్లారిటీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు డీఏ బకాయిల చెల్లింపు విషయంలో పలు ప్రయత్నాలు చేసింది. అయితే ఇంకా ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో నిన్న ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఇందులోనూ ఉద్యోగులకు సంతృప్తికరంగా హామీ లభించలేదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
ఏపీ ప్రభుత్వం పీఆర్సీ, డీఏ బకాయిల కింద 16 వాయిదాల్లో రూ.7,382 కోట్లను ఉద్యోగులకు చెల్లిస్తుందని ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై దృష్టిసారిస్తున్నామన్నారు. క్రమబద్దీకరణ చేయాల్సిన ఉద్యోగుల సంఖ్య దాదాపుగా 10 వేల మంది వరకూ ఉంటుందన్నారు.

అలాగే ఉద్యోగుల సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదని ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓపీఎస్ తో సమానమైన అంశాలతోనే పెన్షన్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సీపీఎస్ ఉద్యోగ సంఘాలు కేబినెట్ లో తీసుకునే నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇక ముందు ఉద్యోగ సంఘాల ఆందోళనలు కూడా ఉండవని భావిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయన్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న ప్రభుత్వం.. ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు కోసం షెడ్యూల్ ప్రకటించింది. అలాగే సీపీఎస్ విషయంలోనూ రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ఖీరణ చేపడున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో దాదాపు అసంతృప్తి తొలగిపోయే అవకాశముంది.












Click it and Unblock the Notifications