ప్రభుత్వం మోసం చేసింది: ఆ జీవోల పట్ల రగిలిన ఏపీ ఉద్యోగులు: మళ్లీ ఆందోళన బాట: నల్లబ్యాడ్జీలతో
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరోసారి ఆందోళన బాట పట్టనున్నారు. వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ భగ్గుమంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలను ధరించి విధుల్లో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

హెచ్ఆర్ఏ తగ్గింపుపై..
పీఆర్సీకి సంబంధించిన జీవోలను ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హౌస్ రెంటల్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)లో భారీగా కోత పెట్టింది. ఇదివరకు 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 16 శాతానికి కుదించింది. ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఈ జీవోలన్నింటినీ తాము వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రకటించారు. పీఆర్సీని తీసుకోవట్లేదని స్పష్టం చేశారు.

జీవోలను వ్యతిరేకిస్తున్నాం..
ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తాము వ్యతిరేకిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్పరాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు నష్టం కలిగించే పీఆర్సీ తమకు వద్దని తేల్చి చెప్పారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఉండటాన్ని తాము ముఖ్యమంత్రితో సమావేశంలోనే వ్యతిరేకించామని అన్నారు. ఇప్పుడు 30 శాతం ఉన్న హెచ్ఆర్ఏను 16 శాతానికి తగ్గించి ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

అశుతోష్ మిశ్రా నివేదికపై..
అప్పట్లో ప్రభుత్వం అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదిక మీదే చర్చించామని, ఇప్పుడు దీనికి భిన్నంగా ప్రభుత్వం జీవోలను జారీ చేసిందని బండి శ్రీనివాస రావు అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక మీద కూలంకషంగా చర్చించిన తరువాత కూడా మళ్లీ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జీవోలను రూపొందించిందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా వ్యవహరించిందని, తమను మోసం చేసిందని ఆరోపించారు.

న్యాయబద్ధమైన డిమాండ్లే..
తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీ, డీఏ, హెచ్ఆర్ఏ గురించి తాము పోరాడుతామని అన్నారు. న్యాయబద్ధంగా తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించడానికి మళ్లీ పోరుబాట పడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయతీలను కూడా రద్దు చేసిందని మండిపడ్డారు.

చెప్పిందొకటి..చేసిందొకటి..
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులను ప్రభుత్వం మోసగించిందని, సమావేశంలో చర్చించిన అంశాలకు భిన్నంగా జీవోలను విడుదల చేసిందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పిందొకటి.. చేసిందొకటిగా తప్పు పట్టారు. పీఆర్సీ జీవోల జారీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా ఇక నుంచి తాము రోజూ నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

సజ్జల జోక్యం..
దీనిపట్ల ప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా ఎవరూ స్పందించలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సాయంత్రానికి విలేకరుల సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జీవోల్లో పొందుపరిచన అంశాల గురించి ఆయన మరోసారి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులతో చర్చిస్తారని అంటున్నారు. వారి డిమాండ్లను మరోసారి తెలుసుకుని.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications