ఏపీలో రేపటి నుంచి ఉచిత బస్సు..! ప్రయాణం మాత్రం అప్పటి నుంచే ?
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన సూపర్ సిక్స్ పథకం స్త్రీ శక్తిని రేపు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో సీఎం చంద్రబాబు మంత్రులతో కలిసి ప్రారంభిస్తారు. అయితే వెంటనే ఈ పథకం ప్రకారం మహిళలకు అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది.
ఏపీలో సీఎం చంద్రబాబు ఉచిత బస్సు పథకం అమలును రేపు మధ్యాహ్నం ప్రారంభించబోతున్నారు. అయితే రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు పంపుతున్నట్లు సమాచారం. సాంకేతికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలును ప్రారంభిస్తున్నారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్దానికంగా ఈ పథకం ప్రారంభించబోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు అనుమతి ఇవ్వబోతున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తాారు. ఎక్స్ ప్రెస్, నాన్ స్టాప్, ఘాట్ రోడ్లు, ఏసీ బసుల్లో ప్రయాణాలకు మాత్రం అనుమతించరు. ఉచిత బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ప్రయాణం చేయవచ్చు. అలాగే జీరో టికెట్ తో వీరికి ప్రయాణాలకు అనుమతిస్తారు. ఇందుకు అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ మెంట్ చేయనుంది.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో అన్నింట్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల హామీ మేరకు అన్ని బస్సుల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణాలు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే ఈ పథకం అమలు వల్ల తమకు ఇబ్బందులు తప్పవని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆటో డ్రైవర్లకు పరిహారంపై సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications