ఏపీలో యూనివర్శల్ హెల్త్ పాలసీకి టెండర్లు-ఎవరెవరికి ఎలా ? సర్కార్ ఉత్తర్వులు..!
ఏపీలో అందరికీ ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో కూటమి సర్కార్ తీసుకొస్తున్న యూనివర్శల్ హెల్త్ పాలసీపై మరో అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవతో కలిపి అమలు చేసేలా ఈ పాలసీ రూపుదిద్దుకోనుంది. ఈ పాలసీ తయారీ, అమలుకు వీలుగా ఇన్సూరెన్స్ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ట్రస్టు ద్వారా అమలవుతోంది. దీని స్ధానంలో హైబ్రిడ్ విధానంలో యూనివర్శల్ హెల్త్ పాలసీ అమలు చేసేందుకు వీలుగా కేబినెటా్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలతో పాటు ఉన్నత ఆదాయ కుటుంబాలకు సైతం వేర్వేరుగా వర్తించేలా ఈ పాలసీని తయారు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో 5 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఏటా 25 లక్షల క్యాష్ లెస్ హెల్త్ కవరేజ్ ఉండేలా యూనివర్శల్ హెల్త్ పాలసీ రూపొందించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 3257 చికిత్సలకు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారు. జాతీయ స్ధాయిలో ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కింద 1946 చికిత్సల్ని ఇలా అందిస్తున్నారు.

వీరితో పాటు దారిద్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు సైతం ఈ ప్రయోజనం అందించేలా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తోంది. తాజా విధానం ప్రకారం 5 లక్షల వరకూ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఏటా 2.5 లక్షల వరకూ కవరేజ్ అందిస్తారు. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ ఖర్చు అయ్యే చికిత్సలను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా అందిస్తారు. ఉన్నత కుటుంబాలకు ఏదాడికి 2.5 లక్షల వరకూ కవరేజ్ మాత్రం అందిస్తారు. ఇందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్లు ఆహ్వానానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications