వ్యాపారులకు దీపావళి కానుక ఇచ్చిన ఏపీ సీఎం.. రూ. 1,500 కోట్లు రిలీజ్ !
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి గుడ్ న్యూస్ ప్రకటించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు పరిశ్రమలకు అందించేందుకు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. తొలి విడతగా రూ.1,500 కోట్ల నిధులు పరిశ్రమలకు విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీకే దీపావళి అన్నారు. ఆ స్ఫూర్తితోనే పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు. అయినా కానీ పారిశ్రామిక రంగానికి అండగా నిలవాలన్న నిబద్ధతతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచి.. ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపారానికి గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాగా ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ తరహా నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. ప్రజలకు సుస్థిర జీవన ప్రమాణాలు అందించవచ్చని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అని రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. లోకకంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఎంతో ప్రాశస్త్యం ఉందని గుర్తుచేశారు.
అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పవిత్రమైన రోజు ఇది అని ఆయన అభివర్ణించారు. "దీపం జ్యోతిః పరంబ్రహ్మ... దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే" అంటూ శ్లోకం పోస్ట్ చేశారు. ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి.. ప్రగతి పథంలో ప్రకాశించాలని కోరుకుంటున్నట్టు పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications