AP Pensions: పెన్షన్లపై మరో కీలక నిర్ణయం..! కలెక్టర్ల చేతికి ఆ మూడు..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లను అర్హులకే అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో పెన్షన్లపై సర్వే నిర్వహించడం, అసలు లబ్దిదారుల్ని గుర్తించడం, అనర్హుల్ని తొలగించడం చేశారు. అయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లతో పాటు మరో మూడు కేటగిరీల పెన్షన్లు కూడా ఇస్తున్నా.. వాటి విషయంలో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో రాజకీయ జోక్యం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జిల్లాల్లో కలెక్టర్ల బాధ్యతల్ని మరోసారి వారికి గుర్తు చేసిన చంద్రబాబు.. వారు కోరిన మరో అధికారాన్ని వారి చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని కలెక్టర్ల సదస్సులో కొందరు ఐఏఎస్ లు ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ల విషయంలో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు వీరికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ పెన్షన్ల మంజూరుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.దీంతో ఇకపై ఈ మూడు వర్గాల వారికి 200 పెన్షన్లను మంజూరు చేసేందుకు కలెక్టర్లకు విచక్షణ లభించినట్లయింది. అలాగే అర్హులకు కూడా న్యాయం జరగబోతోంది.












Click it and Unblock the Notifications