Vijayawada Metro: విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ఇవాళ తొలి అడుగు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది.
విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు కారిడార్లుగా నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వైపు ఓ రూటు, పెనమలూరువైపు మరో రూటు వెళ్లనుంది. అంటే ఏలూరు, బందర్ రోడ్ల మీదుగా ఈ రెండు కారిడార్లు నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు కారిడార్లకు అవసరమైన భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించారు. దీన్ని ఇవాళ క్షేత్రస్ధాయిలో అధికారులు పరిశీలించబోతున్నారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వైపు వెళ్లే మెట్రో రైల్ మార్గంలో 60 ఎకరాలు భూసేకరణ చేయాలని గుర్తించారు. అలాగే పెనమలూరు మార్గంలో 3.5 ఎకరాలు భూసేకరణ చేస్తే సరిపోతుందని గుర్తించారు. దీంతో ఈ రెండు వైపులా సేకరించాల్సిన భూముల్ని ఇవాళ అధికారులు పరిశీలిస్తారు. పెనమలూరువైపు కానూరు, పోరంకిలోని పలు సర్వే నంబర్లలో సేకరించాల్సిన భూమిని పరిశీలిస్తారు. అలాగే గన్నవరంలో 60 ఎకరాలను కూడా పరిశీలిస్తారు.
అనంతరం ప్రభుత్వానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమి, దాని యజమానుల వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం పరిహారం నిర్ణయిస్తుంది. ఇది పూర్తయిన తర్వాత భూసేకరణ ప్రారంభం కానుంది. దీని తర్వాత మెట్రో కారిడార్ల నిర్మాణం లాంఛనంగా ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications