ఇళ్లలోనే వినాయక చవితి ఉత్సవాలు: ఏపీ ప్రభుత్వం నిర్ణయం: రాజకీయ వివాదం అవుతుందా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పైన ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో వినాయక చవితి నిర్వహణ పైన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపులు చేపట్టవద్దని సూచించింది.

వైద్య అధికారుల సిఫార్సు మేరకు..
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలని కోరుతూ వైద్య శాఖ అధికారులు పలు సిఫార్సులు చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని పేర్కొంటూ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్ జాగ్రత్తల దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగించాలని సమీక్షలో నిర్ణయించారు. పండుగల సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సందర్భంగా వైద్యులు, అధికారులు పలు సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

రాజకీయ వివాదంగా మారుతుందా..
అయితే, ఇప్పుడు ఈ నిర్ణయానికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తాయా లేక రాజకీయ వివాదంగా మార్చుతాయా అనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ప్రతీ నిర్ణయాన్ని వివాదం చేసేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇటువంటి నిర్ణయాల విషయంలో బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా మరలా క్రమేణా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
Recommended Video

చవితి వేడులపైన ఆంక్షలు-నిర్ణయం మారుతుందా
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఏపీ వైద్య అధికారులు ఈ నిర్ణయం తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి సిఫార్సు చేసారు. అధికారుల సూచనలతో సీఎం సైతం వెంటనే ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇక, ఈ నెల 10వ తేదీన ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేవలం నివాసాల్లోనే పండుగ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, దీని పైన ప్రభుత్వం తన నిర్ణయం పైన పునరాలోచన చేస్తుందా లేక ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications