ఎన్టీఆర్ పేరు తొలిగింపు - రాత్రికి రాత్రే ఆమోదం: పొలిటికల్ ఎఫెక్ట్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం రాజకీయ వివాదంగా మారుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థానంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంది. మంత్రివర్గం అన్లైన్లోనే దీనికి ఆమోదం తెలిపింది. దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఎన్టీఆర్ పేరుతోనే ఈ యూనివర్సిటీ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం సడన్ గా ఈ విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు మార్చాలని నిర్ణయించింది.

ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు
వైద్యారోగ్య శాఖ మంత్రి శాసనసభలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు సంబంధించి సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేసి... 'వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ'గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది.
మంగళవారం రాత్రి హడావుడిగా ఆన్‌లైన్‌లో మంత్రులకు ఈ సవరణలను పంపి, కేబినెట్ అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 1986లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ మరణానంతరం దానికి ఆయన గుర్తుగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేరు మార్చారు.

మంత్రుల నుంచి ఆమోదం..సభలో బిల్లు
1998లో యూనివర్సిటీ ఆప్ హెల్త్ సైన్సెస్ గా ఉన్న పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆప్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ చట్టాన్ని సవరించారు. అప్పటి నుంచి ఇదే పేరుతో కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితం జరిగిన జిల్లాల పునర్విభన ప్రక్రియలో భాగంగా విజయవాడ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసింది. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు పెడుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. దీని పైన రాజకీయంగా చర్చ మొదలైంది.

సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లు
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టటం ద్వారా టీడీపీలో ఆ ప్రాంతంలో ఆత్మరక్షణలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం..ఇప్పుడు ఈ పేరు మార్పు నిర్ణయంతో ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది సభలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.
రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా..అమరావతిలో భూములు ఇచ్చే విధంగా ఈ మార్పు చేసారు. నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications