శుభవార్త: ఏపీలోని మహిళలు ఒక్కొక్కరికి రూ.40వేలు... అర్హులు వీరే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపద సృష్టిపై దృష్టిసారించారు. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్నిగాడిన పెట్టాలన్నా, సంపదను సృష్టించాలన్నా అందుకు రాజధాని అనేది ముఖ్యమని భావించి డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళలకు స్వయం ఉపాధి పథకాలద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనివ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా వారి ఆదాయాన్ని పెంచబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రం తోడ్పాటునందిస్తూ రూ.40 కోట్లు విడుదల చేసింది.
సరిగ్గా చెల్లిస్తే రుణపరిమితి పెంపు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉంటూ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో కొనసాగుతున్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.40వేలు ఇవ్వనున్నారు. దీన్ని రుణంగా ఇస్తారు. తర్వాత వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. స్త్రీనిధి పథకం ద్వారా వీరికి ఈ రుణాలు అందుతాయి. పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ కింద ఎంపిక చేసిన మహిళలకు ఆరు శాతం వడ్డీకే రుణాలు అందుతాయి. రెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాల పద్దతిలో సక్రమంగా చెల్లించినవారికి రుణ పరిమితిని పెంచుతారు

70 శాతం మంది ఎంపిక పూర్తి
2024-25 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులై ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమను నడుపుతున్న 10వేల మందికి రూ.40వేల చొప్పున ఇస్తారు. సెర్ప్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 6500 మందిని ఎంపిక చేయగా మరో 3500 మంది ఎంపిక త్వరలోనే పూర్తికానుంది. డ్వాక్రా గ్రూపులకు ఇప్పటికే ఇస్తున్న రూ.5 లక్షల రుణాన్ని ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో సభ్యులకు వ్యక్తిగతంగా ఇస్తున్న రూ.2 లక్షల రుణాన్ని రూ.5 లక్షలకు పెంచింది. తద్వారా వీరు స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటారనేది ఏపీ ప్రభుత్వం,చంద్రబాబు ఆలోచనగా ఉంది.












Click it and Unblock the Notifications