'రోడ్డు' రాజకీయం: పవన్ కల్యాణ్, లోకేష్ కు ''జగన్ బ్రేకర్స్''!?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాదయాత్ర కోసం కొత్తగా పాటలను రూపొందిస్తున్నారు. పాదయాత్రకు 'యువగళం' అని పేరు పెట్టారు. 400 రోజులపాటు సుదీర్ఘంగా జరగబోయే ఈ యాత్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

'వారాహి' ద్వారా పవన్ దండయాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన 'వారాహి' వాహనంద్వారా ఏపీపై దండెత్తబోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యంగా చెబుతున్న పవన్ కల్యాణ్ అందుకు తగ్గ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాత్ర విజయ దశమి సమయంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉండటం, వారాహి కూడా సిద్ధం కాకపోవడంతో జనవరికి వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరిలోనే యాత్ర ప్రారంభానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

మార్గదర్శకాల జారీ
సరిగ్గా ఇటువంటి సమయంలోనే ర్యాలీలను, రోడ్ షోలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాటల సందర్భంగా 11 మంది మృతిచెందడంతోపాటు పలువురు గాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. మున్సిపల్, పంచాయితీ రహదారులపై రోడ్డు మార్జిన్ల వద్ద పోలీస్ యాక్ట్ నిబంధన అమలు కాబోతోంది. వాస్తవానికి రాజకీయ నేతలు ఎక్కడ పర్యటించినా రోడ్ మార్జిన్ వద్ద వాహనాన్ని నిలపుదల చేసి ప్రసంగిస్తారు. రేపు లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ చేయబోయే యాత్రలకు ప్రజలు గుమికూడటాన్ని ఒప్పుకోరు. అంతేకాదు కావాలంటే ఎక్కడైనా రోడ్డుకు దూరంగా నిర్వహించుకోవచ్చు.

యాత్రలన్నింటికీ అనువు.. ప్రధాన రహదారులే
కానీ నేతలు చేసే యాత్రలన్నీ ప్రధాన రహదారులమీదగా సాగుతాయి. ప్రధాన రహదారిని వదిలి ఊరికి దూరంగా అధికారులు చూపించే స్థలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోలేరు. రోడ్ షోలకు ఇది ప్రధాన మైనస్ గా మారుతుంది. బస్సు యాత్ర అయినా రహదారిపై వెళ్లాల్సిందే. అలా కాకుండా అధికారులు చూపించిన స్థలాల్లో యాత్ర ద్వారా వీరు ప్రజలను కలుసుకోవాలంటే రోడ్డు దిగి కొంత దూరం వెళ్లాలి. అంటే షెడ్యూల్ లో మార్పు చేయాల్సి ఉంటుంది. ఇలా టూర్ షెడ్యూల్ మొత్తం అప్ సెట్ అవుతుంది. మొదట రూపొందించుకున్న జాబితా ప్రకారం యాత్రను కొనసాగించలేకపోవడమే కాకుండా రూపొందించుకున్న మార్గాల్లో ప్రయాణం చేయలేరు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే పోలీసులు అనుమతివ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రతిపక్షాలు పోలీసులు అనుమతివ్వడం కష్టమే. కాబట్టి లోకేష్ 'యువగళం' కానీ, పవన్ కల్యాణ్ బస్సు యాత్రకానీ అనుకున్నరీతిలో సజావుగా సాగడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications