ఏపీలో ఇళ్లు, స్థలాలపై కీలక అప్డేట్..! వారికి శుభవార్త ..!
ఏపీలో అర్హులైన వారికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఇవాళ అమరావతిలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి, పొంగూరు నారాయణ సమావేశమై రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల్ని మీడియాకు వెల్లడించారు. ఇందులో ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పారు.
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం సెంటు, సెంటున్నర్ర స్థలాలని నివాస యోగ్యం కాని, నిర్మాణాలకు అనువుకాని ప్రాంతాల్లో ఇచ్చి ప్రజలకు గుదిబండల్లా మార్చిందని ఆరోపించారు.

ఎక్కడైతే నిర్మాణాలు జరగలేదో అలాంటి లేఅవుట్లలో లబ్దిదారులను ఒప్పించి చట్టపరంగా వాటిని రద్దుచేసి వారికి మళ్లీ రెండు, మూడు సెంట్లు ఇచ్చే అవకాశాన్ని ఇవాళ సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. చాలా చోట్ల ఈ లేఅవుట్ల నిర్మాణాలకై ప్రైవేటు భూములను సేకరించి, భూ యజమానులకు సొమ్మును చెల్లించడ పోవడం వల్ల లబ్దిదారులకు పట్టాలను కూడా అందజేయడం జరగలేదన్నారు.

అలాగే భూ యజమానులకు డబ్బులు కూడా అందక పలు ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి ఏ విధంగా లబ్దిదారులకు న్యాయం చేయాలనే కోణంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో సుదీర్ఝంగా చర్చించినట్లు తెలిపారు. ఈ అంశంపై అధికారుల స్థాయిలో కూడా మరోకసారి సమావేశాన్ని నిర్వహించిన తదుపరి మంత్రి వర్గ ఉప సంఘం భవిష్యత్ కార్యాచరణ ప్రణాకపై తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీగల్ అడ్డంకులు అధిగమించడంపై ఏజీతో చర్చిస్తామన్నారు.












Click it and Unblock the Notifications