కౌలు రైతులకు అలర్ట్: ఎరువుల కావాలంటే ఇలా చేయండి..
వ్యవసాయ రంగంలో ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ ఏపీ ప్రభుత్వం సరికొత్త విక్రయ విధానానికి శ్రీకారం చుట్టింది. రైతులకు ఎంత పొలం ఉంది? అందులో ఏ పంట వేశారు? దానికి శాస్త్రీయంగా ఎంత మోతాదులో ఎరువులు అవసరం? అనే లెక్కల ప్రకారమే ఇకపై యూరియా, డీఏపీలను విక్రయించనున్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన 'అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్‌పుట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (APAIMS) యాప్ ద్వారా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఈ కొత్త డిజిటల్ విధానంలో ఎరువులు పొందాలనుకునే భూమి కలిగిన రైతులు మొదట APAIMS యాప్‌లో తమ ఆధార్ నంబరును నమోదు చేసుకోవాలి. ఈ యాప్ ప్రభుత్వ 'వెబ్‌ల్యాండ్' పోర్టల్‌తో అనుసంధానమై ఉండటం వల్ల, సదరు రైతుకు ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్ పరిధిలో ఎంత భూమి ఉందనే వివరాలు స్క్రీన్‌పై స్వయంచాలకంగా ప్రత్యక్షమవుతాయి.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో అక్కడ ఏ పంట సాగు చేయదలిచారో నమోదు చేయగానే.. ఆ పంటకు అవసరమైన రసాయన ఎరువుల పరిమాణాన్ని యాప్ నిర్ధారిస్తుంది. ఆ కోటాను కూడా ఒకేసారి కాకుండా మొదటి విడత, రెండో విడతగా ఎంత తీసుకోవాలో విభజించి చూపిస్తుంది. యాప్‌లోనే లభ్యమయ్యే డీలర్ల జాబితా నుంచి రైతు తనకు నచ్చిన దుకాణాన్ని ఎంచుకుని, మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP) ఆధారంగా ఎరువులను కొనుగోలు చేయవచ్చు.
రెండు జిల్లాలకు మినహాయింపు.. నేటి నుంచి అవగాహన సదస్సులు
రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ జిల్లాలకు మాత్రం ఈ యాప్ నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రెండు జిల్లాలను ఎంపిక చేయడంతో, అక్కడ కేంద్ర పరిధిలోని ప్రత్యేక యాప్ ద్వారానే విక్రయాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. అర్హులైన రైతులందరికీ ఎరువులు సక్రమంగా చేరాలనే లక్ష్యంతోనే ఈ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. కొత్త విధానంపై రైతులకు, డీలర్లకు, రైతు సంఘాలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
కౌలు రైతుల కోటాపై అన్నదాతల్లో ఆందోళన
సొంత భూమి ఉన్న రైతులకు ఈ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సులభమే అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 22 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కౌలుదారులకు 'ఈ-పంట' (e-Panta) నమోదు, సాగుదారు హక్కు పత్రాల (CCRC) ఆధారంగా ఎరువులు అందిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు సాధ్యమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సీసీఆర్‌సీ కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేసేసరికి జూలై లేదా ఆగస్టు నెలలు వస్తాయి. అప్పటికే ఖరీఫ్ సగం ముగిసిపోతుంది. వీటన్నింటికీ మించి, భూయజమానులు తమ ల్యాండ్ రికార్డుల్లో కౌలుదారుల పేర్లు నమోదు చేయడానికి అంగీకరించని పరిస్థితులు ఎక్కువ. ఈ నేపథ్యంలో, చట్టబద్ధమైన పత్రాలు లేని కౌలు రైతులకు సకాలంలో ఎరువులు ఎలా అందుతాయనే అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది.














Click it and Unblock the Notifications