విజయవాడ, విశాఖలో ఆటోవాలాలకు అదిరిపోయే న్యూస్..!
విజయవాడ, విశాఖలో ఆటోవాలాలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితులు, ప్రయాణికుల అవసరాలు, కాలుష్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే దీన్ని వెంటనే అమల్లోకి కూడా తీసుకొచ్చింది. దీంతో కొత్తగా మరిన్ని ఆటోలు విజయవాడ, విశాఖ నగరాల్లో ఇక రోడ్లపై కనిపించబోతున్నాయి. అలాగే కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చే వారికి కూడా అవకాశాలు పెరకబోతున్నాయి.
ప్రతీ రాష్ట్రంలోనూ నగరాల వారీగా ఆటోలకు ఇచ్చే పర్మిట్ల విషయంలో ఆంక్షలు ఉంటాయి. ఆయా నగరాల్లో కాలుష్యం, ఇతర పరిస్ధితుల ఆధారంగా రవాణాశాఖ వీటిని కేటాయిస్తుంది. ఈ ప్రకారం రవాణాశాఖ నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ఆటోలు అమ్మకూడదు. అలాగే అవి రోడ్లపై తిరగకూడదు కూడా. ఈ లెక్కన ప్రస్తుతం విజయవాడలో 8700 ఆటోలకు, విశాఖలో 8400 ఆటోలకు మాత్రమే పర్మిట్లు ఉన్నాయి. వీటి సంఖ్య పెంచాలనే డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం చాలా కాలంగా వీటిపై తాత్సారం చేస్తూ వచ్చాయి.

కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటోల పర్మిట్ల జారీ పరిమితుల్ని పెంచడం కాదు ఏకంగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై ఈ రెండు నగరాల్లో ఎన్ని ఆటోల వరకైనా పర్మిట్లు జారీ చేయబోతున్నారు. గతంలో విజయవాడ నగరంలో 2015లో 4500 ఆటోలకు కొత్తగా పర్మిట్లు ఇచ్చారు. అప్పట్లో రాజధానిగా మారడంతో నగరంలో అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాటి సంఖ్యపై పరిమితి ఎత్తేశారు. దీంతో కొత్తగా ఎన్ని ఆటోలకైనా పర్మిట్లు లభించబోతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం వెనుక కీలక కారణాలున్నాయి. రాష్ట్రంలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఇప్పుడు పాత డీజిల్ ఆటోల స్ధానంలో బీఎస్ 6, సీఎన్జీ, ఎల్పీజీ, బ్యాటరీ ఆటోలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు డీజిల్ ఆటోల్ని నడిపేందుకు డ్రైవర్లు కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఎలాగో కొత్తరకం ఆటోలతో కాలుష్యం పెరిగే అవకాశాలు లేవు. దీంతో విజయవాడ, విశాఖ నగరాల్లో ఆటోల పర్మిట్లలపై పరిమితులు ఎత్తేశారు. మిగతా చోట్ల ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఎలాగో అక్కడ కొత్త పర్మిట్లు రెగ్యులర్ గానే లభిస్తున్నాయి.












Click it and Unblock the Notifications