జగన్ కు బిగ్ షాక్ ? కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు భారీ షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి తర్వాత తిరిగి ఆ పార్టీని కోలుకోనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఓ స్కాంపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ ప్రభుత్వం నుంచి ఈ మేరకు ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వ్యవహారాల్లో మద్యం కూడా ఒకటి. రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో ప్రధాన బ్రాండ్లను తరిమేసి, వాటి స్దానంలో సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో దాదాపు 4 వేల కోట్లు చేతులు మారాయని, ఇందులో ఇద్దరు వైసీపీ ఎంపీల పాత్ర ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇదే అంశాన్ని తాజాగా టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తాజాగా పార్లమెంట్ లోనూ ప్రస్తావించారు. మద్యం స్కాంలో 4 వేల కోట్లు దేశం దాటిపోయాయని, దుబాయ్ తో పాటు ఆఫ్రికా దేశాలకు వాటిని తరలించారనే ఆరోపణలు చేశారు. ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుల్లో భాగమేనని తెలుస్తోంది. పార్లమెంంట్లో ఈ వ్యవహారం ప్రస్తావన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. దీంతో మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు అమిత్ షా అనుమతి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే విదేశాలకు ఈ డబ్బులు తరలించినందున ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మద్యం స్కాంలో అప్పటి వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందని కూటమి నేతలు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. ఇప్పుడు ఈ స్కాంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించి, ఈడీ కూడా ఎంట్రీ ఇస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. మద్యం స్కాంలో డబ్బులు అంతిమంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చేరినట్లు నిరూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి అప్పగిస్తేనే ఇది తేలే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications