ఏపీలో పథకాలు కావాలంటే ఆధార్ ఉండాల్సిందే-గెజిట్ జారీ-లేకపోతే ఇలా చేయండి..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష పేరుతో వెతికి వెతికి మరీ పథకాలు అందిస్తోంది. ఇందుకోసం లక్షల కోట్లను సైతం ఖర్చు చేస్తోంది. అయితే ఇంత చేస్తున్నా పలు చోట్ల సంక్షేమ పథకాలు అందలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇకపై అర్హులకు లబ్ది చేయడం, అనర్హుల్ని గుర్తించి తొలగించడం వంటి కార్యక్రమాల్ని ముమ్మరం చేయబోతోంది. ఇందుకోసం తొలి అడుగేసింది.
ఏపీలో ఇకపై సంక్షేమ పథకాలు కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్దిదారులు కచ్చితంగా తమ ఆధార్ కార్డుల్ని లింక్ చేయించుకోవాలని సూచిస్తోంది. అలా చేయడంలో విఫలమైన వారికి ఆయా పథకాలను తొలగించనుంది. తాజాగా దీనిపై ఆయా శాఖలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ఆధార్ చట్టంలో నిబంధనల్ని సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఆధార్ లేకుండా ఇప్పటివరకూ ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వారికి కూడా ఊరటనిచ్చేలా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆధార్ లేకుండా పథకాలు తీసుకుంటున్న వారిని గుర్తించి వారి విషయంలో ఎలా వ్యవహరించాలన్నది కూడా సూచించింది.
ఆధార్ లేకుండా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారిని ముందుగా గుర్తించాలని, వారికి ఆధార్ కు దరఖాస్తు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ కార్డు వచ్చే వరకూ వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో సంక్షేమ పథకాలు అందించాలని సూచించింది. ఆధార్ లేదన్న కారణంతో పథకాలను మాత్రం తిరస్కరించవద్దని తెలిపింది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్ ఇచ్చేందుకు మూడు నెలల గడువు కూడా విధించింది. దీంతో ఆలోపు ఆధార్ తీసుకుని సంక్షేమ పథకాలకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications