జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం- ఆన్ లైన్లో ఏపీ స్కూల్ టెక్స్ట్ బుక్స్.. ఈ వెబ్ సైట్లోనే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యాసంస్కరణల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యావ్యవస్ధలో చేపడుతున్న మార్పుల్లో భాగంగా విద్యార్ధులకు విద్యను పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాఠ్యపుస్తకాలను సైతం ఆన్ లైన్లో అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఆలస్యమైనా, పోగొట్టుకున్నా ఆన్ లైన్లోకి వెళ్లి వీటిని చదువుకునేందుకు వీలు కల్పిస్తోంది.
ఏపీలో ఇకపై ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠ్యపుస్తకాల్ని ఆన్ లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న విజయవాడలో ఇంటర్ ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్లో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ ను ఇకపై పీడీఎఫ్ రూపంలో వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చారు. దీంతో విద్యార్ధులు వీటిని సునాయాసంగా వాడుకునేందుకు వీలు కలుగుతోంది.

ఏపీలో ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ మొత్తం 373 పాఠ్యపుస్తకాలు ఉండగా.. వాటిలో 350 పుస్తకాలను ఇలా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చారు. మిగతా పాఠ్యపుస్తకాలను కూడా త్వరలో పీడీఎఫ్ రూపంలో అప్ లోడ్ చేస్తారు. అయితే వీటిని వాడుకునే విషయంలో ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. దీని ప్రకారం ఈ పాఠ్యపుస్తకాలను విద్యార్ధులు వ్యక్తిగతంగా వాడుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు.
ఆన్ లైన్లో పెట్టిన పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను కేవలం విద్యార్ధుల వ్యక్తిగత అవసరాల కోసమే ఉపయోగించు కోవాలని, వీటిని ముద్రించి , మార్కెట్ లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 42 లక్షల మందికి ఉచితంగానూ , ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 28 లక్షల మందికి విక్రయ పద్దతిన పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్లో ఉంచిన పాఠ్యపుస్తకాలను ఎలా వాడుకోవాలన్న దానిపైనా వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఈ పాఠ్యపుస్తకాలన్నిటినీ https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాపార నిమిత్తం ప్రచురించడాన్ని మాత్రం నిషేధించారు. ఈ ఆన్ లైన్ పీడీఎఫ్ పుస్తకాల్ని అక్రమంగా ముద్రించినా, అమ్మినా, మార్పులు చేర్పులు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించంది.












Click it and Unblock the Notifications