ఏపీ ఆలయాలపై దుష్ప్రచారం-ఫిర్యాదులకు కొత్త నంబర్-పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్న డీజీపీ
ఏపీలో వరుసగా జరిగిన ఆలయాల ఘటనలను సాకుగా చూపుతూ ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయాల ఘటనలకు సంబంధించి నమోదు చేసిన కేసుల వివరాలను డీజీపీ ఇవాళ బయటపెట్టారు. ఇప్పటివరకూ 44 ఆలయాల్లో ఘటనలకు సంబంధించి 29 కేసులు నమోదు చేసి 80 మంది కరడుగట్టిన అంతర్ రాష్ట్ర నేరస్తులు, ముఠాలను అరెస్టు చేశామని డీజీపీ తెలిపారు.
ఏపీలో ఆలయాలకు తాము కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. ఇలాంటి ప్రమాణాలు తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమను సంప్రదిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు.
దేవాలయాల్లో సామాగ్రి దొంగతనాలకు సంబంధించి కూడా గతేడాది సెప్టెంబర్ నుంచి 180 కేసులను ఛేదించి 337 మంది అరెస్టు చేశామని డీజీపీ సవాంగ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గానూ, 15394 గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేశామని, త్వరలో మిగిలిన 7862 దళాలు ఏర్పాటు చేస్తామన్నారు.

కొంతమంది పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారం చేసి, ప్రచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని డీజీపీ తెలిపారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీజీపీ హెచ్చరించారు. ఇప్పటివరకూ దేవాలయాల ఘటనల్లో 4895 మంది నిందితులను గుర్తించామన్నారు. వీరిపై నిరంతర నిఘాతో పాటు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల సమీపంలో అనుమాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే 9392903400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు.