
ఏపీలో ఇక డాక్టర్ల పల్లెబాట- సరికొత్త వ్యవస్ధకు సర్కారు ప్లాన్-ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఏపీలోని వేలాది గ్రామాల్లో వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చే లక్ష్యంతో వైసీపీ సర్కారు ఓ విన్నూత్న కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని ఓ కంట కనిపెడుతూ ఉండే డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో తనకు అప్పగించిన ప్రజల ఆరోగ్య పరిస్ధితిపై పూర్తి అవగాహన ఉండే ఏర్పాటు, మరిన్ని 104 వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మరిన్ని విన్నూత్న కార్యక్రమాలను ఇందులో చేపట్టబోతోంది. దీనికి విధివిధానాలు తయారు చేయాలని సీఎం జగన్ ఇవాళ జరిగిన సమీక్షలో అధికారులను కోరారు.

గ్రామీణ ప్రజల కోసం మరో వ్యవస్దకు శ్రీకారం
ఏపీలో వేలాదిగా ఉన్న గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలవుతున్నా ఇంకా గ్రామాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. దీంతో గ్రామాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చేందుకు ఓ కొత్త వ్యవస్ద రూపకల్పనకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం, డాక్టర్ల సంఖ్య పెంపు, పీహెచ్‌సీల సంఖ్య పెంపు, 104 సర్వీసుల పెంపు వంటివి భాగం కానున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది.

కొత్త వ్యవస్ధ ఇలా ఉండాలన్న జగన
ప్రభుత్వం రూపొందించబోయే కొత్త వ్యవస్ధలో గ్రామాల్లోకి డాక్టర్లు వచ్చి వైద్యం తప్పనిసరిగా చేసేలా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగ ప్రతీ మండలంలో రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలన్నారు. ప్రతీ కేంద్రంలో కనీసం ఇద్దరు డాక్టర్లు చొప్పున గ్రామంలో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. నెలకు రెండుసార్లు డాక్టర్లు తనకు అప్పగించిన గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆరోగ్య స్ధితిగతులను ఆరా తీయాలి. అప్పుడు తన పరిధిలోని ప్రజల ఆరోగ్యంపై ఆయనకు ఓ అవగాహన వస్తుందన్నారు.
డాక్టర్‌కు తోడుగా ఆరోగ్యమిత్రలు, ఆశావర్కర్లు పనిచేసేలా ఈ వ్యవస్ధ ఏర్పాటు చేస్తారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఇలా గ్రామాల్లో రెండేసి పీహెచ్‌సీలు, అందులో నలుగురు డాక్టర్లు, తరచూ రోగులను కలుసుకోవడం, ఆరోగ్యమిత్రలు, ఆశావర్కర్ల సాయంతో డాక్టర్లు పనిచేయడం .. అంతిమంగా రోగికి తనకో ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారన్న ఫీలింగ్ రావాలని సీఎం జగన్ నిర్దేశించారు.
అలాగే 104వాహనాల సంఖ్యను కూడా పెంచి వాటి ద్వారా రోగులకు అక్కడికక్కడే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను కూడా ఇందుకు వాడుకునేలా అనుసంధానం చేస్తారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. మెరుగైన వైద్యం అవసరమైన సందర్భంలో డాక్టర్లు రిఫర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యవస్ధను ఎప్పటికల్లా అందుబాటులోకి తెస్తారో తనకు చెప్పాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇందుకోసం ఉదారంగా నిధులు కేటాయించాలని జగన్ అధికారులను ఆదేశించారు.