ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో టాప్ ఇవే..! తాజా ర్యాంకుల విడుదల..!
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం వాటి మధ్య పోటీ తత్వం పెంచేందుకు పనితీరును మదింపు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జిల్లాల వారీగా ఎక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగ్గా ఉన్నాయో వాటి ర్యాంకుల్ని ప్రకటించారు. వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. గత 6 నెలల్లో వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపి సేవల్లో పురోగతి కనిపిస్తోందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవల సమయం 42 నిమిషాల నుండి 26 నిమిషాలకు తగ్గినట్లు మంత్రి తెలిపారు. నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నూతన మూల్యాంకన వ్యవస్థ ద్వారా జిల్లాలకు ర్యాంకులు ప్రకటించారు. అగ్రస్థానంలో తూర్పుగోదావరి, కడప, తిరుపతి జిల్లాలు ఉన్నట్లు తేలింది. వెనుకబడ్డ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి.

గత 6 నెలల పనితీరును సమగ్రంగా సమీక్షించిన తర్వాత ఈ ర్యాంకులు ఇస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు ఈ ఏడాది ఏప్రిల్‌లో 83 శాతం నుంచి సెప్టెంబరు నాటికి 92 శాతానికి పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నర్సులు, పారా మెడికల్ సిబ్బంది హాజరు 90 శాతానికి పైగా హాజరు నమోదైంది. వైద్యుల హాజరు 82 శాతం మాత్రమే ఉండడం పట్ల తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

అలాగే అసంక్రమిక వ్యాధులబారిన పడిన వారికి చికిత్సలు అందించడంలో లోపాన్ని సవరించాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య శాలల్లో మొత్తం 4 కోట్లకు పైగా ఓపీ సేవలు నమోదు అయినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. మూల్యాంకన వ్యవస్థ ఫలితాల ఆధారంగా వెల్లడైన లోపాలను సరిదిద్దుకోడానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications