వైఎస్ జగన్ గుడ్ న్యూస్... వారికి అకౌంట్ లో డబ్బులు
కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం దక్కని వారికి మరో అవకాశం కల్పించింది. అర్హత ఉండి ఇంకా పెట్టుబడి సాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించే పనిలో ఉన్నారు.ఈ నెల 30వ తేదీ వరకు రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
వైఎస్సార్ రైతుభరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూ సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.

రైతులకు జనవరిలో మూడో విడత సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కౌలుదారులు, అటవీ భూసాగుదారులకు లబ్ధి చేకూర్చాలని రైతు భరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. ఈనెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం దీన్ని మళ్లీ ఓపెన్ చేశారు. కౌలుదారులు సీసీఆర్సీతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అటవీ భూమి సాగుచేసేవారు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఆర్బీకేకి వెళ్లి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వీరికి జనవరిలో సాయం అందనుంది. వివరాలు నమోదు చేసుకునేందుకు ఈనెల 30 చివరితేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications