వైసీపీకి సర్కార్ బిగ్ షాక్- ఆ మున్సిపల్ పీఠాలపై అనూహ్యంగా వేటు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ మున్సిపల్ పీఠాల్ని దాదాపుగా దక్కించుకుంది. వీటిని వారి నుంచి లాక్కునేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన అధికార కూటమి సర్కార్ ఇవాళ అసాధారణ చర్యలకు దిగింది. వైసీపీకి చెందిన ఓ మున్సిపల్ ఛైర్మన్, మరో కార్పోరేషన్ మేయర్ పై సాంకేతిక కారణాలు చూపుతూ మున్సిపల్ శాఖ వేటు వేసింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న వాటిలో కడప మేయర్ సీటు, మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు ఉన్నాయి. కడప మేయర్ గా సురేశ్ బాబు, మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ గా తురగా కిషోర్ అప్పట్లో ఎన్నికయ్యారు. అయితే వీరిని పదవుల నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. అవన్నీ ఫలించకపోవడంతో ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపుతూ వీరిపై వేటు వేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది..

కడప నగరంలో అభివృద్ధి పనుల్ని తన కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఎంఎస్ వర్ధిని కన్ స్ట్రక్షన్స్ కు అప్పగించారనే కారణంతో మేయర్ సురేశ్ బాబుపై మున్సిపల్ శాఖ ఇవాళ వేటు వేసింది. ఈ కాంట్రాక్టు సంస్థను మేయర్ సురేశ్ బాబు కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ నడుపుతున్నారని గుర్తించారు. ఈ సంస్థ ద్వారా 36 లక్షల అవినీతికి పాల్పడ్డారనే విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయర్ సురేశ్ బాబుపై వేటు వేశారు.

అలాగే మాచర్లలో మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్ అనుమతి లేకుండా కౌన్సిల్ భేటీలకు గైర్హాజరు అయ్యారనే కారణం చూపి ఆయనపై వేటు వేశారు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 16(1) ప్రకారం ఇలా అనుమతి లేకుండా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు గైర్హాజరు కావడం నిబంధనలకు విరుద్దమని ఆరోపిస్తూ తురగా కిషోర్ పై వేటు వేశారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్ గా కిషోర్ ను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications