వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఏపీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్షణికావేశంలో నేరాలు చేసి రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో మగ్గుతున్న వారికి శుభవార్త చెప్పింది.
ఖైదీలకు క్షమాభిక్ష మార్గదర్శకాలను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వివిధ కేసులలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చి ముందస్తుగా విడుదల చేయడానికి మార్గదర్శకాలను ఖరారు చేసింది. అర్హులైన, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల వివరాలతో జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జైళ్ళ శాఖ డీజీ ని ఆదేశించింది.

జాబితాను సమీక్షించేందుకు కమిటీ
హోం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, న్యాయశాఖ కార్యదర్శి, డిజిపి, సిఐడి ప్రధాన న్యాయ సలహాదారు, నిఘా విభాగాధిపతి, జైళ్ళ శాఖ డిజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఆ జాబితాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి ఖైదీకి సంబంధించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారి కేసుల వివరాలను పరిశీలించిన అనంతరం, అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది.
క్షమాభిక్ష కోసం ఎంపిక చేసే ఖైదీలకు నిబంధనలు
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ ఒకటవ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ఈ క్రమంలోనే అర్హులైన ఖైదీల పేర్లు సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డీజీ అంజని కుమార్ కు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది .ఇక క్షమాభిక్ష కోసం ఎంపిక చేసిన ఖైదీలు 50వేల రూపాయల షూరిటీ తో పాటు శిక్షాకాలం పూర్తయ్యే వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు నెలలకు ఒకసారి సంతకం చేయాలని పేర్కొంది.
క్షమాభిక్ష మార్గదర్శకాల విడుదల
ఈ క్రమంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక విడుదలైన తర్వాత ఏదైనా నేరానికి పాల్పడినా, మళ్లీ ఏదైనా కేసులో అరెస్ట్ అయినా క్షమాభిక్ష రద్దు అవుతుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులను జారీ చేశారు.












Click it and Unblock the Notifications