ప్రధాని మోదీకి చంద్రబాబు రిక్వెస్ట్ - అంగీకరిస్తారా..!!
ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో తాజా ప్రతిపాదన పంపింది. కేంద్రం నుంచి ఏపీకి వరుసగా పలు కీలక అంశాల్లో మద్దతు లభిస్తోంది. ఆర్దికంగా చేయూత అందిస్తోంది. అమరావతి, పోలవరం తో పాటుగా పలు రైల్వే లైన్లు.. రహదారులకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ఏపీ నుంచి మరో ప్రతిపాదన కేంద్రానికి అందింది. విజయవాడ, విశాఖ మెట్రో డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలని అభ్యర్ధించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మెట్రో డీపీఆర్ ఆమోదం
ఏపీలో మెట్రో ప్రాజెక్టుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల పూర్తిస్థాయి డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్రో తొలి దశ పనులు చేపట్టడానికి వీలుగా మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించింది. ప్రాజెక్టు అంచనాలను కేంద్రానికి పంపింది.

విభజన చట్టం హామీ
ఏపీ పునర్విభజన చట్టం లోని 13వ సెక్షన్‌లో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తానని పేర్కొంది. దీని ప్రకారం నిధులను నూరు శాతం కేంద్రమే భరించాలి. దీంతో, తాజా రెండు ప్రాజెక్టుల్లో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి వంద శాతం ఖర్చు భరించేలా కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన 'క్లాజ్'ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసారు. 40 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరంలో మెట్రో ఏర్పాటును కేంద్రం ప్రత్యేకంగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో, ఈ రెండు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని విజయవాడ, విశాఖ మెట్రోల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు.
ప్రతిపాదనలు సిద్దం
దీంతో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పూర్తి ఖర్చు 42,362 కోట్ల ఖర్చకు కేంద్రం బాధ్యత తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఇందుకు కేంద్రం అంగీకరిస్తే రాష్ట్రానికి భారీ రిలీఫ్ దక్కనుంది. కేంద్రం నుంచి అనుమతులు వస్తే వెంటనే రెండు నగరాల్లో మెట్రో ఫేజ్ -1 పనులు ప్రారంభించేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ సిద్దం అవుతోంది. విజయవాడలో 38.40 కిలో మీటర్లు, విశాఖలో 46.23 కిలోమీటర్ల మేర తొలిదశ పనులు చేపట్టనుంది. మెట్రో నిర్మాణం లో రాష్ట్రంలో థర్డ్‌లైన్ విధానంతో ముందుకు వెళ్లనున్నారు. దీని ద్వారా ట్రాక్ నుంచే విద్యుత్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తీగలు ఎక్కడా కనిపించవు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. సమావేశాల సమయంలోనే కేంద్రం నుంచి ఈ తాజా ప్రతిపాదనలకు ఆమోదం పొందేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications