కేంద్రం నుంచి తక్షణ సహాయం కోరిన ఏపీ ప్రభుత్వం
మొంథా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను పంపారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి తక్షణ ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రాథమిక నివేదికలో అంశాలవారీగా ఏయే శాఖలు, ఏయే రంగాల వారీగా ఎంతమేర నష్టం వాటిల్లిందన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. అలాగే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలను పేర్కొంది.

ఆర్టీజీఎస్ నుంచి తుఫాన్ ప్రభావాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుందో వివరించింది. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్టు తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువుగా ఉందని నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడింది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది.
తుఫాన్ వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు తుఫాన్ తీవ్రతను అద్దం పట్టేలా ఫోటోలను లేఖతో జతపరిచి... తుఫాన్ నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కోరింది. అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. అత్యధికంగా రహదారులు, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో నష్టం సంభవించినట్టు పేర్కొన్నారు. తుఫాన్ వల్ల ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.
4,794 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు-బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం రూ.2,774 కోట్ల మేర ఉందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీ రాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఈ శాఖకు రూ.454 కోట్ల నష్టం జరిగింది. 48 పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు విధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు వ్యయం కానుందని నివేదికలో చెప్పారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని... దీంతో రూ.829 కోట్ల వరకు రైతులు నష్టపోయినట్టు నివేదిక చెబుతోంది. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని రూ.40 కోట్ల విలువైన ఉద్యానపంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు.












Click it and Unblock the Notifications