అంగన్వాడీలపై వేటు - ప్రభుత్వం సంచలన ఆదేశాలు..!!
ఏపీలో అంగన్వాడీల సమ్మె పై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై వేటు వేశారు. ఈ రోజు అంగన్వాడీలు 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అంగన్వాడీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఏపీలో అంగన్వాడీలు గత 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం పలు విడతలు చర్చలు చేసింది. జీతాల పెంపు పైన అంగన్వాడీలు పట్టు పడుతున్నారు. జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

దీని పైన లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అంగన్వాడీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. అంగన్వాడీల సేవలు అందక ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం వివరించింది. విధులో చేరాలని కోరింది. కానీ, అంగన్వాడీల నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. వేతనాలు పెంచే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
దీంతో, కొద్ది రోజుల క్రితం అంగన్ వాడీల సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. దీని పైన వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అంగన్ వాడీల సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునివ్వటం తో పలు ప్రాంతాల్లో అంగన్ వాడీలను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. వారి నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లోకి రాని వారిని తొలిగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications